iDreamPost

మళ్లీ నీళ్లే టీఆర్‌ఎస్‌ ఆయుధం

మళ్లీ నీళ్లే టీఆర్‌ఎస్‌ ఆయుధం

గ్రేటర్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రచార పర్వం ఊపందుకుంది. నేతల మాటలు మంటల్లా కాలిపోతున్నాయి. ఓ వైపు ప్రచారంలో ఆకట్టుకుంటూనే.. మరోవైపు అధికారంలోకి వస్తే తాము చేయబోయే పనులపై ఆయా పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్‌ చేశాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో పరిశీలిస్తే ఈసారి కూడా మంచినీళ్లు ప్రధానంగా మారాయి. 2016లో ఎన్నికలకు ముందే నీటి బకాయిలన్నింటినీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఎన్నికల్లో డిసెంబర్‌ నెల నుంచి 20 వేల లీటర్ల నీళ్ల వరకు బిల్లులు చెల్లించాల్సిన అవసరమే లేదని మేనిఫెస్టోలో పేర్కొంది. గ‌తంలోను, ఇప్పుడు కూడా మంచినీటిని గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌లో ప్ర‌ధాన అంశంగా తీసుకుంది.

9 లక్షల కుటుంబాలను ఆకట్టుకునేలా…

గ్రేటర్‌ పరిధిలో వాటర్‌బోర్డుకు 10.80 లక్షల నీటి కనెక్షన్లున్నాయి. వీటిలో రెండు నుంచి మూడు శాతం వరకు కమర్షియల్‌ కనెక్షన్లు కాగా మిగతావన్నీ గృహా అవసరాల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. నీటి కనెక్షన్‌దారులు ఎన్ని వేల లీటర్ల నీళ్లను వాడుకున్న కానీ 20వేల లీటర్లను మినహాయించి మిగిలిన వాటికి మాత్రమే వాటర్‌బోర్డు బిల్లులు వసూళ్లు చేయనుంది. దీని ద్వారా సుమారుగా 9 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

ఎయిర్‌పోర్ట్‌కు రైట్‌ రైట్‌..

జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో సేవలను అందుబాటులోకి తీస్తుకొస్తామని కూడా టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును కీలక ప్రాజెక్టుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేసి, జీఓ 66ని జారీ చేసింది. అయితే, రెండో దశలో చేపట్టేందుకు నిర్ణయించిన పనులకు సంబంధించి రెండేళ్ల నుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముం దుకు పడలేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో చేర్చడంతో మరోసారి చర్చనీయాంశమైంది.

మూసీకి మెరుపులు..

మూసీ సమస్య దశాబ్దాల నాటిది. రెండో సారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మూసీనది ప్రక్షాళనకు ప్రభుత్వం మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీ)ను ఏర్పాటు చేసింది. తాజాగా గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో మూసీనదిని గోదావరితో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొంది. మూసీనదికి ఇరువైపులా ఫెన్సింగ్‌ నిర్మించి, చెత్తాచెదారాన్ని తొలగించడం, తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు బోటింగ్‌ ఏర్పాటు చేస్తామని, రూ.5వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని వెల్లడించింది. వీటితో పాటు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రస్తావన, ఇతర అభివృద్ధికి కూడా పెద్ద పీట వేస్తూ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రూపొందించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి