iDreamPost

విదేశాలనుండి వచ్చేవారికి జియో ఫెన్సింగ్ -గౌతమ్ సవాంగ్

విదేశాలనుండి వచ్చేవారికి జియో ఫెన్సింగ్ -గౌతమ్ సవాంగ్

విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిని ఇంటిలో, ప్రభుత్వ క్వారంటైన్ లో కట్టడి చెయ్యడం కష్టతరం కావడంతో రాష్ట్ర పోలీసులు చైనా తరహా లో సరికొత్త విధానాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులందరిని వారి పూర్తి వివరాలతో జియో ట్యాగింగ్ కు అనుసంధానం చెయ్యడం ద్వారా నియంత్రించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

ఈమేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సాంకేతిక నిపుణులైన పోలీసు అధికారుల బృందం ఒక కొత్త హౌస్ క్వారంటైన్ యాప్ ని రూపొందించింది. ఈ యాప్ ను శుక్రవారం ఒక్కరొజే క్వారంటైన్ లో ఉన్న 5 వేల మందికి పైగా ఇన్ స్టాల్ చేసుకున్నట్టు తెలిసింది. శుక్ర శనివారాల్లో మరో 20 వేల మంది ఈ యాప్ పరిధిలోకి రానున్నారని సమాచారం. ఈ జనవరి నుండి ఇప్పటి వరకు విదేశాల నుండి మన రాష్ట్రానికి 28 వేల మంది వరకు వచ్చినట్టు సమాచారం.

ఈ జియో ట్యాగింగ్ ఎలా పని చేస్తుంది??

విదేశాల నుండి వచ్చి హౌస్ క్వారంటైన్ లో ఉంటున్న వారు ఈ క్వారంటైన్ యాప్ లో తమ ఫోన్ నంబర్, తమ వ్యక్తిగత అరోగ్య వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఈ క్వారంటైన్ యాప్ జియో ఫెన్సింగ్ కు అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల హోం క్వారంటైన్ లో ఉన్న వారు తమ ఇంటి నుండి 50 మీటర్లు దాటి బయటకి వస్తే తక్షణమే పోలిస్ కంట్రోల్ రూము కి ఆ సమాచారం వెళ్తుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే కంట్రోల్ రూం నుండి దగ్గరలో ఉన్న పొలిస్ స్టేషన్ కి మెస్సెజ్ చేరుతుంది. దానితో లోకల్ పోలీసులు నిమిషాల వ్యవధిలో అక్కడకి చేరుకొని నిభంధనలు ఉల్లంఘించి హోం క్వారంటైన్ నుండి బయటకి వచ్చిన వ్యక్తి ని అదుపులోకి తీసుకునే అవకాశం కలుగుతుంది.

జియో ఫెన్సింగ్ ద్వారా హోం క్వారంటైన్ లో ఉన్న వారిపై పటిష్టమైన నిఘా తో పాటు, కరొనా వైరస్ బాదితులకు అవసరమైన వైద్య సేవలు, స్వీయ నియంత్రణ కు సూచనలు మొత్తం పోలీసుల పర్యవేక్షణలో జరుగుతాయి. దేశంలో కరొనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ క్లిష్ట సమయంలో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన ఏపీ పోలీసులకు ప్రశంశలు లభిస్తున్నాయి.

దీని గురించి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను కరొనా వైరస్ భారి నుండి రక్షించడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను కటినంగా అమలు చేస్తూనే మరోవైపు వైరస్ విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారితో ఈ వైరస్ రిస్క్ ఎక్కువగా ఉండడంతో వారిపై మరింత నిఘా పెట్టామని తెలిపారు. అందుకనే ఈ హౌస్ క్వారంటైన్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. జియో ఫెన్సింగ్ తో అనుసంధానం చెయ్యడం వలన సదరు క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచెందుకు ఇది లక్ష్మణ రేఖ లా ఉపయోగపడుతుందని డీజీపీ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి