iDreamPost

టాలీవుడ్ లో గుచ్చుకున్న ఫ్రీమేకులు

టాలీవుడ్ లో గుచ్చుకున్న ఫ్రీమేకులు

ఏదేని భాషలో హిట్ అయిన సినిమాలను ఆ సినిమా హక్కులను కొని మిగిలిన భాషల్లో రీమేక్ చేసి హిట్ కొట్టడానికి నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం రీమేక్ రైట్స్ కొనకుండానే కొన్ని సినిమాలను రూపొందిస్తారు.. వీటినే ఫ్రీమేకులు అంటారు. అలా వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తమకు(నిర్మాతలకు) తెలియకుండా రూపొందిస్తే సదరు నిర్మాతలు కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంటారు.

ఎక్కువగా హాలీవుడ్ సినిమాలను, బాలీవుడ్ సినిమాలను మక్కికి మక్కీ దించేసి యాదృశ్చికంగా జరిగి ఉండొచ్చేమో కానీ తాము కావాలని ఆయా సినిమాలను కాపీ కొట్టలేదని వివరణ ఇచ్చినా కాపీ కొట్టారన్న విషయం సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి అర్ధం అవుతుంది. ఇప్పుడైతే సోషల్ మీడియా పరిధి పెరిగింది కాబట్టి కాపీ వివాదాలు బయటకు వస్తున్నాయి కానీ, ఒకప్పుడు అలా తెలుసుకునే వీలుండేది కాదు. అలాంటి సినిమాలు తెలుగులో కూడా రూపొందాయి. వాటిలో కొన్ని సినిమాలను పరిశీలిస్తే..

ఫేస్ ఆఫ్ – 1997 లో జాన్ వూ దర్శకత్వంలో రూపొందిన ఫేస్ ఆఫ్ ఒక సంచలనం.. సరికొత్త స్క్రీన్ ప్లే తో రూపొందిన ఫేస్ ఆఫ్ ప్రశంసలతో పాటు అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు గెలుచుకుంది.. హీరో కథ నడిచేకొద్దీ విలన్ గా మారడం, విలన్ హీరోగా మారడం ఈ సినిమాలో ప్రత్యేకత. అయితే ఇదే సినిమాను మక్కికి మక్కీ దించిన సూపర్ స్టార్ కృష్ణ తానే దర్శకత్వంతో పాటు హీరోగా నటిస్తూ “మానవుడు-దానవుడు “రూపొందించారు. 1999 లో విడుదలయిన ఈ సినిమాను ప్రేక్షకులు నిర్ద్వందంగా తిరస్కరించడంతో పరాజయం పాలయ్యింది.

డంబ్ అండ్ డంబర్ – 1994లో పీటర్ ఫారెల్లి దర్శకత్వంలో రూపొందిన హాస్య ప్రధాన చిత్రం “డంబ్ అండ్ డంబర్” ఆ సంవత్సరం కలెక్షన్ల సునామి సృష్టించింది.. జిమ్ కారీ , జెఫ్ డేనియల్స్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. సుమారు 17 సంవత్సరాల తర్వాత సత్య వారణాసి దర్శకత్వంలో రూపొందిన “వరప్రసాద్ పొట్టి ప్రసాద్” డంబ్ అండ్ డంబర్ చిత్రానికి ఫ్రీమేక్ అన్నమాట.. శ్రీనివాస్ అవసరాల, విజయ్ సాయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకుల నిరాదరణకు గురై పరాజయం పాలయ్యింది..

బ్యాండ్ బాజా బారత్ -2010లో మనీష్ శర్మ రూపొందించిన బ్యాండ్ బాజా బారత్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. అనుష్క శర్మ, రణవీర్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అవార్డులు ప్రేక్షకుల రివార్డులు గెలుచుకుంది. కాగా ఈ చిత్రానికి ఫ్రీమేక్ గా రూపొందిన జబర్దస్త్ మాత్రం ప్రేక్షకాదరణకు నోచుకోలేదు.. సిద్దార్ధ్, సమంత జోడి కూడా జబర్దస్త్ పరాజయాన్ని తప్పించలేకపోయింది. ఆడియో మాత్రం హిట్ అయ్యింది. ఇదే చిత్రాన్ని యష్ రాజ్ సంస్థ నాని, వాణి కపూర్ జోడీగా, ఆహా కళ్యాణం పేరుతో మళ్ళీ తెలుగులో రూపొందించారు. ఆహా కళ్యాణం కూడా బ్యాండ్ బాజా బారత్ సాధించిన విజయాన్ని రిపీట్ చేయలేక చతికిలపడింది.

వాంటెడ్ – 2008 లో హాలీవుడ్ లో రూపొందిన వాంటెడ్ చిత్రం ప్రేరణగా తెలుగులో ఓం 3డి రూపొందింది..కన్నతండ్రిని చంపడానికి అతని కొడుకునే వాడుకునే ఈ సరికొత్త కథ హాలీవుడ్ లో విజయం సాధించగా, దాన్ని కాస్త తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఫామిలీ డ్రామాగా మార్చి ఓం 3డిగా తీశారు.. కానీ ప్రేక్షకులు తిరస్కరించడంతో ఓం 3డి ఫట్ మంది.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో పరాజయాన్ని ఈ ఫ్రీమేక్ వేసింది.

లార్గో వించ్ – 2008 లో జెరోమీ సాల్లె దర్శకత్వంలో రూపొందిన ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ప్రేరణగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాత వాసి రూపొందించారు. అజ్ఞాతవాసి విడుదలయ్యాక పలు వివాదాలు చుట్టుముట్టాయి. లార్గో వించ్ దర్శకుడు జెరోమీ అజ్ఞాతవాసి విషయంలో బహిరంగంగా విమర్శలు చేయడంతో అందరి చూపు అజ్ఞాతవాసిపై పడింది. లీగల్ నోటీసుల వరకూ వెళ్లిన ఈ వివాదం ఇరువైపులా సామరస్యంగా పరిష్కరించుకోవడంతో సద్దుమణిగింది.. కాగా ఈ చిత్రం ఫ్రెంచ్ తెలుగు భాషల్లో కూడా పరాజయం పాలవడం విశేషం..

హాలీవుడ్, బాలీవుడ్ లలో విజయవంతమైన చిత్రాలను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రూపొందించడంలో దర్శకులు చేసిన పొరపాట్ల కారణంగా ఆయా భాషల్లో ఘనవిజయం సాధించినా తెలుగులో మాత్రం విజయానికి నోచుకోలేదు.. అందుకే ఈ ఫ్రీమేకులు టాలీవుడ్ లో అచ్చిరాలేదనే చెప్పుకోవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి