iDreamPost

నాలుగులోనూ అవే ఫలితాలు.. మాజీ మంత్రికి షాక్.. బాబుకు ఊరట..

నాలుగులోనూ అవే ఫలితాలు.. మాజీ మంత్రికి షాక్.. బాబుకు ఊరట..

దశ ఏదైనా పంచాయతీ ఎన్నికల ఫలితాల దిశ మారడం లేదు. మొదటి మూడు దశల ఫలితాల్లో సత్తా చాటిన వైసీపీ మద్ధతుదారులు నాలుగో దశలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవగా.. అటు వార్డులు, ఇటు సర్పంచ్‌ స్థానాలు వైసీపీ మద్ధతుదారుల ఖాతాల్లో పడిపోతున్నాయి. వైసీపీ మద్ధతుదారులు సత్తా చాటుతున్నారు. భారీ స్థాయిలో సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంటున్నారు.

3,299 పంచాయతీలకు గాను రాత్రి 9:30 గంటల వరకు ఏకగ్రీవాలైన స్థానాలతో కలిపి వైసీపీ మద్ధతుదారులు 1,751 స్థానాల్లో విజయబావుట ఎగురవేశారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు 199 పంచాయతీల్లో విజయం సాధించారు. బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు 20 స్థానాల్లోనూ, స్వతంత్ర అభ్యర్థులు 22 స్థానాల్లో విజయం సాధించారు. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మేజర్‌పంచాయతీల్లోనూ లెక్కింపు పూర్తయి.. తెల్లవారుజామునాటికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ నెల 9వ తేదీన జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 3,249 స్థానాలకు వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 2,640 స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు 510 పంచాయతీలను గెలుచుకున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 96 పంచాయతీలలో గెలుపొందారు. మరో మూడు పంచాయతీలకు ఎన్నికలు వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి.

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరగ్గా.. 3,328 పంచాయతీలకు వైసీపీ మద్ధతుదారులు 2,649 స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు 538 పంచాయతీలను గెలుచుకున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 138 స్థానాల్లో గెలుపొందారు. ఈ దశలోనూ మూడు పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు.

ఈ నెల 17వ తేదీన జరిగిన మూడో విడతలో 3,221 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వివిధ కారణాలతో మూడు పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవమైన స్థానాలతోపాటు వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 2,580 స్థానాలను గెలుచుకున్నారు. టీడీపీ మద్ధతుదారులు 527 పంచాయతీల్లో గెలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 108 స్థానాల్లో విజయం సాధించారు.

మొదటి మూడు దశల్లో మాదిరిగా నాలుగో దశలోనూ వైసీపీ మద్ధతుదారులు హవా సాగుతోంది. ప్రతి దశలోనూ వైసీపీ మద్ధతుదారులు 80 శాతానికిపైగా స్థానాలను గెలుచుకున్నారు. నాలుగో దశలోనూ అదే స్థాయిలో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచేలా ఫలితాలు వెల్లడవుతున్నాయి.

నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ టీడీపీ కంచుకోటలు బద్ధలవుతున్నాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ స్వగ్రామం వెన్నెలపాలెంలో ఆయన సతీమణి మాధవీలత ఓటమిపాలయ్యారు. వైసీపీ బలపర్చిన వెన్నెల అప్పారావు 582 ఓట్ల మెజారిటీతో బండారు సత్యనారాయణ సతీమణిపై విజయం సాధించారు. ఆ గ్రామంలో ఉన్న పది వార్డుల్లోనూ వైసీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలవ్వగా.. చంద్రబాబు స్వగ్రామం నా రావారి పల్లెలో టీడీపీ బలర్చిన అభ్యర్థి విజయం సాధించడం.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు  కార్యకర్తల ఊరటనిచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి