iDreamPost

ఉక్రెయిన్ నుంచి భారత్ చేరిన నాలుగు విమానాలు.. తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇంటికి

ఉక్రెయిన్ నుంచి భారత్ చేరిన నాలుగు విమానాలు.. తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇంటికి

ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం నేటికి నాలుగోరోజుకు చేరింది. రష్యా దాడులు ఇప్పుడు అదుపుచేయలేని విధంగా మారుతున్న క్రమంలో ఆ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులు, చదువు నిమిత్తం వెళ్లి చిక్కుకున్న వారిని వెనక్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ అనే ఎయిర్ లిఫ్ట్ మిషన్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు నాలుగు విమానాలు ఉక్రెయిన్ లో చిక్కుకున్న బాధితులతో ఇండియా చేరాయి. ఇప్పటిదాకా 907 మందిని రుమేనియా రాజధాని బుకారెస్ట్ మీదుగా తరలించారు. వారు మూడువిమానాల్లో విడతల వారీగా స్వదేశం చేరుకున్నారు. బుకారెస్ట్ నుంచి తొలి విమానంలో 219 మంది ముంబాయి వచ్చారు.

రెండో విమానంలో 250 మంది ఢిల్లీకి చేరుకున్నారు. బుడాపెస్ట్ నుంచి మూడో విమానంలో 240 మంది ఢిల్లీకి వచ్చారు. అలాగే నాలుగో విమానంలో 198 మంది బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు జైశంకర్ హంగేరీ, మోల్డోవా విదేశాంగ మంత్రితో మాట్లాడారు. భారతీయుల తరలింపులో సహకరించినందుకు హంగేరీ విదేశాంగ మంత్రికి ఎస్ జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో రష్యాపై జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు పోలాండ్ భారీ ఉపశమనం ప్రకటించింది. వీసా లేకుండా కూడా భారతీయ విద్యార్థులు పోలాండ్‌లోకి ప్రవేశించవచ్చని న్యూఢిల్లీలోని పోలాండ్ రాయబారి తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు బెంగుళూరు, హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి తమ ప్రాంతాలకు వెళుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి ఇప్పటిదాకా 23మంది తెలంగాణ విద్యార్థులు చేరుకున్నారు.

వీరు కాక ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు కూడా హైదరాబాద్, గన్నవరం విమానాశ్రయాలకు చేరుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయి స్పందనను పత్తికొండ తహశీల్దార్ రిసీవ్ చేసుకున్నారు. అలాగే మరోపక్క ఉక్రెయిన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు విద్యార్థులకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరిన విద్యార్థులు గన్నవరం చేరుకున్నారు. వీరిలో వంశీ (గుంటూరు),అభిషేక్ (తెనాలి) ఫర్జానా (కానూరు), అనూష (కౌతవరం) గ్రామాలకు చెందిన విద్యార్థులున్నారు. వీరు కాక ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధినులు. సుష్మా, సుదర్శనలు కూడా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో స్వగృహానికి చేరారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. చొరవచూపి ఇండియా తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి