iDreamPost

‘అనంత’లో చిన్నారులకు ఫుడ్ పాయిజన్ .. అంతా సేఫ్

‘అనంత’లో చిన్నారులకు ఫుడ్ పాయిజన్ .. అంతా సేఫ్

అనంతపురం రూరల్ మండల పరిధి, కళ్యాణదుర్గం రోడ్డులోని కక్కలపల్లి కాలనీకి చెందిన మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థులు అందరూ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పిల్లలు తీసుకునే మధ్యాహ్న భోజనం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి శామ్యూల్ ప్రకటించారు.

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పిల్లలందరూ అస్వస్థతకు గురికావడంతో అక్కడ ఉన్న టీచర్లు వెంటనే స్పందించి పై అధికారులకు సమాచారం ఇచ్చి వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనం తిన్నాక 39 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వదిన, శ్రీవెంకటేశ్వర వెటర్నటీ యూనివర్సిటీ కౌన్సిల్‌ మెంబర్‌ తోపుదుర్తి నయనతా రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ ఆరా తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే విజయవాడలో ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడి అధికారులకు ఫోన్ చేసి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు ఈ ఘటనకు కారణమైన విషయాలు మీద విచారణ చేపట్టారు. ఘటనకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు డా.తలారి రంగయ్య కూడా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో, వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులతో డా.రంగయ్య స్వయంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి