iDreamPost

హాట్ కేక్ లాంటి సబ్జెక్టుతో సినిమాలు

హాట్ కేక్ లాంటి సబ్జెక్టుతో సినిమాలు

లాక్ డౌన్ ని దశలవారిగా మెల్లగా సడలిస్తున్నారు. షూటింగులకు సైతం రూట్ క్లియరవుతోంది. అతి త్వరలో పరిమిత యూనిట్ సభ్యుల మధ్య ప్రభుత్వ నిబంధనలకు లోబడి సెట్స్ పైకి నటీనటులు రాబోతున్నారు. ఖచ్చితమైన విధి విధానాలు, తేదీలు ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా వైరస్ దేశాన్ని కుదిపేయబట్టి ఇప్పటికే రెండున్నర నెలలు దాటేసింది. పూర్తి స్థాయిలో ఇది వైదొలగి పోవడం ఇప్పట్లో జరగని పనే. ఎవరి జాగ్రత్తలో వారుంటూ సహజీవనం చేయాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదని ప్రధానితో మొదలుపెట్టి ముఖ్యమంత్రుల దాకా అందరిదీ ఇదే మాట.

దీని సంగతలా ఉంచితే ఇప్పుడీ కాన్సెప్ట్ మీద ఎన్ని సినిమాలు వస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకా బాలన్స్ షూట్ చాలా ఉన్న చిత్రాలు దీన్ని క్యాష్ చేసుకుంటూ కరోనా పాయింట్ మీద కొన్ని సీన్లు, ఎపిసోడ్లు రాయిస్తున్నారట . సీరియల్స్ లో సైతం వీటి ప్రస్తావన ఎక్కువగా ఉండబోతోందన్నది వాస్తవం. అంతగా కరోనా అనే మాట జనంలోకి బలంగా దూసుకుపోయింది. ఉదయం లేచినప్పటికి నుంచి టీవీ న్యూస్ ఛానల్స్ పెట్టడం ఆలస్యం కొన్ని వేలలక్షల సార్లు కోరోనా అనే పదంతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడి సంగతేమో కాని బాలీవుడ్ లో మాత్రం కొందరు ఫిలిం మేకర్స్ కరోనా కాన్సెప్ట్ తో సీరియస్ గా లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

ముంబైలో వైరస్ తాకిడి అధికంగా ఉండటంతో ఏ కార్యకలాపాలు జరగడం లేదు. అంతా సద్దుమణిగాక టైటిల్స్ కోసం ఫిలిం ఛాంబర్ లో దర్శక నిర్మాతలు పోటెత్తడం ఖాయమంటున్నారు. లాక్ డౌన్, వైరస్ లాంటి టైటిల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉందట. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు సైతం వీటికోసం పోటీపడుతున్నారని ముంబై టాక్. అప్పుడెప్పుడో ముంబై దాడులు జరిగితే ఇప్పటికీ ఆ కాన్సెప్ట్ తో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాంటిది కరోనా లాంటి ఫ్రెష్ థీమ్ ని మన మేకర్స్ విడిచి పెడతారా. స్టార్లు సైతం వీటిలో నటించినా ఆశ్చర్యం లేదు. తెలుగులో ఆలోచిస్తారేమో కాని హింది, మలయాళంలో ఇలాంటివి బోలెడు చూడటం మాత్రం ఖాయం. ఇక షార్ట్ ఫిలిమ్స్, మేమ్స్, ఇండిపెండెంట్ మూవీస్ తో పాటు సుదీర్ఘంగా సాగే వెబ్ సిరీస్ లు కూడా కరోనా, లాక్ డౌన్ ల మీద స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయట. మరి ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాణాలు తీసుకున్న మహమ్మారినా మజాకా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి