iDreamPost

Exit Poll 2022: 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌.. గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయంటే?

Exit Poll 2022: 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌.. గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయంటే?

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. అయితే ఒక్కటొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి అనే విషయం మీద పలు సర్వే సంస్థలు, మీడియా సంస్థలు చేసిన అన్ని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్:

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 403 కాగా వీటిలో 84 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ)రిజర్వ్ చేయబడ్డాయి. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలకు) రిజర్వ్ అయ్యాయి. ప్రస్తుతానికి యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఎగ్జిట్ పోల్స్:

మ్యాట్రిజ్-పోల్ బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది. P-MARQ కూడా 240 సీట్లు (+-15) గెలుచుకోవచ్చని అంచనా వేసింది. పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి కమలనాథులకు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని పేర్కొంది. ఆత్మసాక్షి గ్రూప్‌ మాత్రం బీజేపీ ఘోర పరాభవం తప్పదని అంచనా వేసింది. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని వెల్లడించింది. యూపీలో మళ్ళీ బీజేపీ గెలుస్తుందని టీవీ9 పోల్‌స్ట్రాట్‌ చేసిన సర్వేలో తేలింది. సిఎన్ఎన్ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.

పంజాబ్:

పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 34 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ అయ్యాయి. ఇక్కడ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఎగ్జిట్ పోల్స్:

ఇండియా టుడే, మై యాక్సిస్ ఇండియాల అంచనాల ప్రకారం, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రానుంది. కానీ ఆత్మసాక్షి పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తోంది. పీపుల్స్‌ పల్స్‌ కూడా ఆమ్ ఆద్మీ పార్టీగెలుస్తుందని అంచనా వేసింది. టీవీ9 పోల్‌స్ట్రాట్‌ చేసిన సర్వేలో పంజాబ్‌ పీఠం ఈసారి ఆప్‌ కైవసం చేసుకోబోతున్నట్టు చెబుతోంది. .

ఉత్తరాఖండ్:

ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఎగ్జిట్ పోల్స్:

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతుందని అంచనా వేసింది. P-MARQ ఏమో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది. ఆత్మసాక్షి ఏమో ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి పరాభవం తప్పదని వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని పీపుల్స్‌ పల్స్‌ అంచనా వేస్తోంది. టీవీ9 పోల్‌ స్ట్రాట్‌ సర్వే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సమాన విజయావకాశాలు ఉన్నట్టు చెబుతోంది. ఉత్తరాఖండ్‌ లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని టైమ్స్ నౌ సర్వే చెబుతోంది. ఏబీపీ-సీ ఓటర్‌ సర్వ్ ప్రకారం కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. CNX ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ గెలిచే అవకాశం ఉంది. గ్రౌండ్ జీరో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండనుంది.

గోవా:

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కేవలం పెర్నెం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే షెడ్యూల్డ్ కులాల (SCలు) కోసం రిజర్వ్ చేశారు. ఇక ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఎగ్జిట్ పోల్స్:

గోవాలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడేలా కనిపిస్తోందని టీవీ9 పోల్‌స్ట్రాట్‌ సర్వే వెల్లడించింది. సీఎన్‌ఎక్స్‌ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని పేర్కొంది. జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్‌ సర్వే ప్రకారం బీజేపీ మరోసారి గెలుపొందనుందని అంచనా వేసింది. P-MARQ ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని పేర్కొంది.

మణిపూర్:

మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. వీటిలో 19 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) కోసం రిజర్వ్ అయ్యాయి. సెక్మాయి నియోజకవర్గం ఒక్కటే షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ అయింది. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఎగ్జిట్ పోల్స్:

జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్ ప్రకారం మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం మరో మారు అధికారంలోకి రానుంది. గ్రౌండ్ జీరో ఎగ్జిట్ పోల్ ప్రకారం.. బీజేపీ మరో మారు గెలవనుంది. P-MARQ ఎగ్జిట్ పోల్ అంచనాల మేరకు బీజేపీ గెలుపొందనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి