iDreamPost

సుజయ్‌ కృష్ణ చూపు…విజయనగర టీడీపీకి షాకేనా…?

సుజయ్‌ కృష్ణ చూపు…విజయనగర టీడీపీకి షాకేనా…?

మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు చూపు విజయనగరం తెలుగుదేశంకు షాక్‌ ఇవ్వనుందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే చెప్పకతప్పదు. గత ఎన్నికల్లో బొబ్బిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సుజయ్‌ కృష్ణ తిరిగి వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అదే కానీ జరిగితే ఇప్పటికే జిల్లాలో అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న టీడీపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టవటం ఖాయం.

2004లో కాంగ్రెస్‌ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన సుజయ్‌ కృష్ణ అదే పార్టీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్‌ జగన్‌ వైపు నిలబడ్డారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున బొబ్బిలి నుంచి గెలుపొందారు. అయితే రాజకీయ ప్రత్యర్థయిన బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీలో చేరడం, పార్టీలో ఆయనకు ప్రాధాన్యత దక్కుతుండటం, చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని ఆకర్షించడంతో 2016లో టీడీపీలోకి జంపయ్యారు. చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ నియోజకవర్గం, జిల్లాపై సొంత ముద్ర వేయడంలోసుజయ్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అప్పలనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బొబ్బిలి(సుజయ్‌), విజయనగరం(అశోక్‌గజపతి) రాజవంశాలు రెండూ పార్టీలో ఉంటే విజయనగరంలో టీడీపీకి ఎదురే ఉండదని భావించిన చంద్రబాబు ఎత్తుగడలకు భిన్నంగా టీడీపీ ఏకంగా జీరోకి పరిమితమైన సంగతి తెలిసిందే.

గత ఎన్నికల్లో ఓటిమి, జిల్లాలో పెత్తనమంతా ఆశోక్‌గజపతిరాజుదే కావడంతో సుజయకృష్ణ పూర్తిగా డీలా పడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించట్లేదు. చంద్రబాబు సైతం ఆయన్ను పూర్తిగా విస్మరించారు. బొబ్బిలి టీడీపీ ఇంఛార్జ్‌గా సుజయ తమ్ముడు బేబీ నాయనను నియమించడం, ఇటీవల రాష్ట్ర కార్యవర్గంలో సుజయ్‌కు చోటు కల్పించకపోవడమే దానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో సుజయకృష్ణ పాత గూటికి చేరాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్‌ జగన్‌  అంగీకరించి అన్నీ అనుకున్నట్లు జరిగితే అన్నతమ్ములిద్దరూ త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరడం లాంఛనమే. అదే జరిగితే విజయనగర టీడీపీ పరిస్థితి మరింత తీసుకట్టుగా తయారవుతుందని చెప్పకతప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి