iDreamPost

తప్పించుకుతిరుగుతున్న దేవినేని..!

తప్పించుకుతిరుగుతున్న దేవినేని..!

దేవినేని ఉమామహేశ్వరరావు.. పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్‌ జగన్‌పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా ఒంటికాలిపై లేస్తుంటారు. సవాళ్లు చేస్తూ హల్‌చల్‌ చేస్తుంటారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.. వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోయారు. సీఐడీ విచారణకు వరుసగా రెండోసారి డుమ్మా కొట్టి విమర్శలపాలవుతున్నారు.

సద్విమర్శలు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. అక్రమాలు, అవినీతిపై ఆధారసహితంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే బాధ్యత ప్రతిపక్షానిది. కానీ ఆధారరహితంగా. పనికట్టుకుని బురదజల్లే తీరు వల్ల ప్రతిపక్ష పార్టీ నేతలు చిక్కులు కొనితెచ్చుకుంటుంటారు. దేవినేని కూడా ఇలాగే చిక్కులు కొనితెచ్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల వేళ.. మత పరమైన అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారన్నట్లుగా.. ఓ వీడియోను దేవినేని తిరుపతిలో మీడియా సాక్షిగా విడుదల చేశారు. వైఎస్‌ జగన్‌ మాటలను వక్రీకరించడం, మార్ఫింగ్‌ వీడియోలు ప్రదర్శించడంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన సీఐడీ కేసు నమోదు చేసింది.

మీడియా ముందు ప్రదర్శించిన వీడియోతో సహా కర్నూలులోని ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సీఐడీ దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే గంటల వ్యవధిలో విజయవాడ నుంచి కర్నూలుకు ఎలా వస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. దేవినేని విచారణకు హాజరుకాలేదు. దీంతో సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని ముందుగానే తెలిపింది. అయితే ప్రయాణానికి తగినంత సమయం ఉన్నా.. ఈ సారి కూడా దేవినేని విచారణకు డుమ్మాకొట్టారు.

తాను చేసిన ఆరోపణలు, ప్రదర్శించిన వీడియో సరైనదే అయితే.. దేవినేని ఉమా మహేశ్వరరావు విచారణకు ఎందుకు హాజరుకావడంలేదన్నదే ప్రధాన ప్రశ్న. తప్పు చేయనప్పడు తప్పించుకుతిరగాల్సిన పనేముంది..? ధైర్యంగా విచారణ ఎదుర్కొవచ్చు కదా..? అనే చర్చ జరుగుతోంది. విచారణకు ఎందుకు హాజరుకాలేకపోతున్నారో కూడా దేవినేని వెల్లడించలేదు.

Also Read : ఫిర్యాదు చేస్తే సరా..? లాజిక్‌తో పనిలేదా..?

సీఐడీ కేసు నుంచి తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయించే పనిలో దేవినేని ఉన్నారా..? అనే సందేహాలు మొదలయ్యాయి. ముచ్చటగా మూడోసారి సీఐడీ నోటీసులు పంపనుంది. అప్పుడు కూడా విచారణకు హాజరుకాకపోతే.. తదుపరి చర్యలకు సీఐడీ అధికారులు సిద్ధమవుతారు. మరి దేవినేని సీఐడీ విచారణకు హాజరవుతారా..? లేక కోర్టులకు వెళతారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి