iDreamPost

అఖిల ప్రియకు బెయిల్‌.. భర్త భార్గవ్‌ రామ్‌కు దక్కని ఊరట..

అఖిల ప్రియకు బెయిల్‌.. భర్త భార్గవ్‌ రామ్‌కు దక్కని ఊరట..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సమీపంలోని బోయినపల్లిలో జరిగిన కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయి రిమాండ్‌లో ఉన్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్‌ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సికింద్రాబాద్‌ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రేపు శనివారం అఖిల ప్రియ జైలు నుంచి విడుదల కానున్నారు.

భూ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్‌లో అఖిల ప్రియతోపాటు ఆమె భర్త, అత్తమామల హస్తం కూడా ఉందని పోలీసులు తేల్చారు. అఖిల ప్రియ పోలీసులకు దొరకగా.. ఆమె భర్త భార్గవ్‌ రామ్, అత్తమామలు పరారీలో ఉన్నారు. భార్గవ్‌ రామ్‌ను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరో వైపు తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని భార్గవ్‌ రామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. భార్గవ్‌ రామ్‌తో పాటు ఇతర నిందితులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

బోయినపల్లిలోని కోట్ల రూపాయల విలువైన భూమి విషయంలో భూమా అఖిలప్రియకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీప బంధువు ప్రవీణ్‌ రావు సోదరులకు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్‌ చేయించిన అఖిల ప్రియ దంపతులు.. వారి చేత బలవతంగా పత్రాలపై సంతకాలు తీసుకుని వదిలిపెట్టారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగగా అఖిల ప్రియ దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ అజ్ఞాతం వీడితే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి, అఖిల ప్రియపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి