iDreamPost

అఖిల ప్రియకు కొత్త చిక్కులు

అఖిల ప్రియకు కొత్త చిక్కులు

కిడ్నాప్‌ కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు కొత్త చిక్కులు ఎదురవబోతున్నాయి. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్‌ మంజూరు చేయాలన్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. వైద్యాధికారుల నుంచి అఖిల ప్రియ ఆరోగ్యంపై నివేదిక తెప్పించుకున్న కోర్టు.. ఆ నివేదిక పరిశీలించిన తర్వాత ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. అదే సమయంలో ఈ కేసు విచారణ కోసం అఖిల ప్రియను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఏడు రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరగా.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఆమెను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని కిడ్నాప్‌ కేసుపై లోతుగా విచారించబోతున్నారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్, కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసిన గుంటూరు శ్రీనులు ఇంకా పరారీలోనే ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తూ ఆచూకీ లభించడంలేదు. భార్గవరామ్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించిన మాదిరిగానే ఆయన వ్యవహార శైలి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ గాలిస్తున్నా.. భార్గవ్‌ రామ్‌ జాడ మాత్రం తెలియడం లేదు. అతను సెల్‌ ఫోన్‌ కూడా వాడడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ మాధ్యమా ద్వారా కూడా ఆయన తన వాళ్లతో టచ్‌లో ఉండడంలేదు. ఫలితంగా భార్గవ్‌ రామ జాడ కనుక్కొవడం పోలీసులకు కష్టంగా మారింది. అఖిల ప్రియను విచారిస్తే.. భార్గవ్‌ రామ్‌ ఆచూకీ తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అతను ఎక్కడ తలదాచుకునేదీ అఖిలకు తెలిసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

కిడ్నాప్‌ వ్యవహారానికి భూ వివాదమే ప్రధాన కారణమని ఇప్పటికే తేలింది. అయితే ఈ కేసులో అఖిల ప్రియ, ప్రస్తుతం ఆమెకు విరోధిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిలు కూడా నిందితులుగా ఉండడంతో అసలు కథ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. అఖిల ప్రియ తనను చంపించాలని ప్లాన్‌ చేసిందని ఇటీవల ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆయన హత్యకు జరిగిన కుట్రను పోలీసులు బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ రావు కిడ్నాప్‌ వ్యవహారంలో వారిద్దరూ సంయుక్తంగా ఎలా పాల్గొన్నారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. అఖిల ప్రియను విచారించడం ద్వారానే ఈ కేసులో పురోగతి వస్తుందని పోలీసులు యోచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి