iDreamPost

మరో మాజీ మంత్రిని బలితీసుకున్న కరోనా

మరో మాజీ మంత్రిని బలితీసుకున్న కరోనా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మరణించారు. కరోనా బారిన పడిన ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రిపదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. టీడీపీ ని వీడి కేసీఆర్ గూటిలో చేరిన ఆయన టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ లో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రి గా పనిచేశారు.

చందులాల్ ఆగస్టు 171954 లో ములుగు ప్రాంతంలోని జగ్గన్నపేట్ లో జన్మించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఎదిగారు. ఆయనకి భార్య శారద, వారికి ఒక కుమార్తె ముగ్గురు కుమారులున్నారు.

తొలుత 1981-1985 జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 – 1989 లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.1994 -1996 2వ సారీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996 లో వరంగల్ లోక్ సభ సభ్యులుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకుడు రామసహాయం సురేందర్ రెడ్డి పై యం.పి.గా టీడీపీ తరపున గెలిచి సంచలనం సృష్టించారు. 1998 లో కూడా వరుసగా రెండోసారి విజయం సాధించారు. తిరిగి 2014లో మళ్ళీ శాసనసభ్యునిగా ములుగు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి గెలుపొందారు. కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు.

సీనియర్ నేతగానే కాకుండా, వివాదరహితుడిగా చందూలాల్ సాగిపోయారు. అన్ని పార్టీలతోనూ సన్నిహితంగా మెలిగారు. ఆయన కరోనా మూలంగా మరణించడం పట్ల సీఎం కేసీఆర్ సహా వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తంచేశారు. గుర్తింపుపొందిన గిరిజన నేత మరణం తీరనిలోటు అని పేర్కొన్నారు. 

Also Read : వెంటాడిన దురదృష్టం.. కాబోయే మేయర్‌ మృతి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి