iDreamPost

మైదుకూరు చైర్మన్ పీఠం టిడిపికి దక్కుతుందా…?

మైదుకూరు చైర్మన్ పీఠం టిడిపికి దక్కుతుందా…?

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఫ్యాన్ ధాటికి టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. ఎక్కడ చూసినా వార్ వన్ సైడ్ గా మారింది. అయితే మైదుకూరు పుర ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సీఎం జగన్ సొంత జిల్లా లో టీడీపీకి చెప్పుకోదగ్గ వార్డులు గెలిచింది ఒక్క మైదుకూరులోనే.

మైదుకూరు నియోజకవర్గ ప్రజల నాడి పట్టణానికి.. పల్లె కు వచ్చేసరికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లోనూ వైసీపీకి మైదుకూరు ప్రజలు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక వార్డులు గెలుచుకుని చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ వెంటనే జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు.

పంచాయతీ లో ఫ్యాన్ హవా…

మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మైదుకూరు లో మొత్తం పంచాయతీలు 90 ఉండగా అందులో 22 పంచాయతీ లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 68 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వైసిపి 54, తెలుగుదేశం 10, వైసిపి రెబల్‌ 4 సర్పంచ్ లను గెలుచుకుంది.

మున్సిపాలిటీ లో సీన్ రివర్స్

మున్సిపల్ ఎన్నికలకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ మొదటి నుంచి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న 2006లోను ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా పల్లె ప్రజలు వైసీపీ ని ఆదరించగా, పట్టణ ఓటర్లు కాస్త టీడీపీ వైపు మొగ్గుచూపారు. దీనికి తోడు టీడీపీ ఇంచార్జి పుట్టా సుధాకర్ యాదవ్ అభ్యర్థులకు భారీగా ఆర్థిక సాయం చేయడం ఆ పార్టీకి కలిసొచ్చింది.

ఫలితాలు ఇలా…

మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం 26 ఓట్లు. ఈ లెక్కన 14 ఓట్లు ఏ పార్టీకి వస్తే వారికే చైర్‌పర్సన్‌ పదవి దక్కుతుంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 24వార్డులకుగాను 12 వార్డులను టీడీపీ గెలుచుకుంది. 11 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఒక చోట జనసేన గెలుపొందింది.

వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకోవడంతో ఇక్కడ వైసీపీ బలం 13కు పెరిగింది. అయితే ఇక్కడే ట్విస్ట్ నడుస్తోంది. జనసేన అధిష్టానం మాత్రం తమ అభ్యర్థిని టీడీపీ కి మద్దతు ఇవ్వాలని ఆదేశించింది. కానీ, స్థానికంగా జనసేన అభ్యర్థికి వైసీపీ నాయకులతో బంధుత్వం ఉంది. దీనితో ఆయన ఎటు వైపు మొగ్గుచూపుతాడానే విషయంపై స్పష్టత రాకున్నప్పటికీ … బంధుత్వం దృష్ట్యా అతను వైసీపీ కే మద్దతు ఇచ్చే అవకాశం ఉండడంతో పుర పీఠం పై వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉంది.

ఇప్పటికే రెండు పార్టీలు క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తూ సభ్యులు జారిపోకుండా జాగ్రత్త పడటంతోపాటు చివరివరకు ఇదే సంఖ్యను కొనసాగిస్తూ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, బీటెక్‌ రవి, శివనాథ్‌రెడ్డిలకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటుహక్కు ఉండటంతో ఎక్స్ అఫీషియో సభ్యులుగా వీరికి అవకాశం కల్పించలేదు.

Also Read : ఆశ్చర్యకరంగా మైదుకూరు ఫలితం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి