iDreamPost

మెట్టు దిగిన కేంద్రం… పట్టు వీడేనా రైతులు

మెట్టు దిగిన కేంద్రం… పట్టు వీడేనా రైతులు

నూతన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్రం మెట్టుదిగింది. తొమ్మిది రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రైతు సంఘాలతో నాలుగు సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. కేంద్రం ప్రతిపాధనలను రైతులు తిరస్కరించారు. మరోవైపు… నిరసన నుంచి నిష్ర్కమించడానికి కూడా ససేమిరా అన్నారు. పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ చేరుకున్న లక్షలాది మంది రైతులు రోడ్లమీదే నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు రైతులు.

మరో వైపు రైతుల పోరాటానికి దేశ, విదేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. సినీ తారలు, క్రీడాకారులు మొదలు రాజకీయ ప్రముఖులెందరో రైతుల పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించారు. రైతులకు మద్దతుగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాళీద‌ళ్ నేత‌ ప్రకాశ్ సింగ్ బాద‌ల్ ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత కర్తార్ సింగ్, బాస్కెట్ బాల్ క్రీడాకారులు సజ్జన్‌సింగ్, హాకీ క్రీడాకారుడు రజ్‌బీర్ కౌర్ సైతం తమ పురస్కారాలను వెనక్కిఇవ్వడానికి ముందుకు వచ్చారు. రోజు రోజుకు రైతులకు పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను సవరించడానికి కేంద్రం సిద్ధమైంది. పంటకు మద్దతు ధరను హామీ ఇవ్వడంతో పాటు, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చట్టాల్లో పేర్కొన్న కాంట్రాక్టు వ్యవసాయంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించడానికి కేంద్రం సిద్ధమైంది. ప్రధాని నివాసంలో సమావేశమైన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తోమర్ , పియూష్ గోయల్ ఈ నిర్ణయాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాధనలను రైతుల సంఘాల ముందుంచనుంది ప్రభుత్వం.

ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతు సంఘాలు ఎలా స్పందిస్తాయనే ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ప్రభుత్వం సూచించే మధ్యే మార్గాలతో సంతృప్తినొందుతారా? లేక తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పోరేట్ కంపెనీలకు మేలుచేసివిగా ఉన్నాయని రైతులు మొదటి నుంచీ వాదిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాధిస్తున్న సవరణలతో కార్పోరేట్ సంస్థల పెత్తనానికి ఎలాంటి భంగం కలిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు తమ ఆందోళనను కొనసాగించగలుగుతారా? లేక ప్రభుత్వం చేసే ప్రతిపాధనలకు అంగీకరిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా కేంద్రం మెడలు వంచడంలో రైతాంగం విజయం సాధించిందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి