iDreamPost

దిశా చట్టం విఫలమైందా?

దిశా  చట్టం విఫలమైందా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దిశ చట్టంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సహా దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ప్రశంశల వర్షం కురుస్తోంది. దిశ చట్టంపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి పలు రాష్ట్రాల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే నారా లోకేష్‌తో సహా కొన్ని మీడియా సంస్థలు మాత్రం దిశ చట్టం ఫెయిల్ అయిందని ప్రూవ్ చేయడానికి నానా పాట్లు పడుతుండటం మాత్రం విచారకరం.

మహిళలపై దాడుల విషయంలో కఠిన శిక్షలు…అది కూడా సత్వర శిక్షలు ఉండాలని జగన్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఇప్పటికే కొన్ని చట్టాలు ఉండొచ్చు,కానీ క్రిమినల్స్‌కి భయం పుట్టించేలా కొత్తగా కఠినమైన చట్టాలు వస్తే తప్పేంటి? అది కూడా న్యాయ ప్రముఖులు కూడా ఆ చట్టాన్ని ప్రశంసిస్తున్నారంటే గొప్ప విషయమే. స్వయంగా చంద్రబాబు కూడా దిశ చట్టాన్ని సమర్థించాల్సిన పరిస్థితి. ఆ చట్టంపై మీడియా కూడా మొదటి రోజు ప్రశంశల వర్షం కురిపించింది.

అయితే దురదృష్టం ఏంటంటే దిశ చట్టం ఫెయిల్ అయిందని, బాధితులకు న్యాయం జరగడం లేదు, నిర్భయ చట్టం లాగే దిశ చట్టం కూడా నిరుపయోగం అవ్వబోతోంది అనే తరహాలో చట్టసభలలో దిశ చట్టం ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచే నారా లోకేష్‌తో సహా కొన్ని మీడియా సంస్థలు దిశ చట్ట వ్యతిరేక ప్రచారాన్ని చేస్తూ ఉండడం విస్తు గొలుపుతోంది. దిశ చట్టం నిరుపయోగమా? ఉపయోగమా అనే విషయాలను ఆరు నెలల తర్వాత కూడా సమీక్షించొచ్చు.

కానీ మహిళల కోసం చేసిన చట్టంగా కాకుండా జగన్ ప్రవేశ పెట్టిన చట్టంగా చూస్తున్న ప్రతిపక్షం, ఆ పార్టీ భజన మీడియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్‌కి పేరు రాకూడదు అన్నట్టుగా కథనాలు వండి వారుస్తూ ఉండడం మాత్రం ఆయా వ్యక్తుల, సంస్థల సామాజిక బాధ్యతపై సందేహాలు రేకెత్తేలా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జరుగుతున్న దారుణాలు చూసి కాస్తైనా మార్పు చూపించాలి అన్న ఉద్ధేశ్యంతో పాలకులు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వడం నైతిక ధర్మం, సమాజానికి ఉపయోగకరం అన్న విశ్లేషణల పట్ల దిశ చట్టం ఫెయిల్ అయింది అని నిరూపించాలనుకుంటున్నవాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి