iDreamPost

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ లో దేవుడు చేసిన గోల్

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ లో దేవుడు చేసిన గోల్

క్రికెట్ అభిమానులు సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ దేవుడిగా భావించినట్టు 1980 దశకంలో ఫుట్‌బాల్ అభిమానులు అర్జెంటీనా ఆటగాడు డీగో మారడోనాని ఫుట్‌బాల్ దేవుడిగా భావించారు. మైదానంలో చురుగ్గా కదులుతూ ప్రత్యర్థుల నుంచి బంతిని చేజిక్కించుకుని, వారికి అందకుండా బంతిని తన జట్టులో ఫార్వర్డ్ ఆటగాళ్లకు అందించడమో లేక తనే గోల్ చేయడమో చేస్తూ అభిమానులతో “గోల్డెన్ కిడ్” అని పేరు తెచ్చుకున్నాడు మారడోనా.

1986 ప్రపంచ కప్…

1986లో మెక్సికో దేశంలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్పులో అర్జెంటీనా ఫేవరైట్ జట్టుగా అడుగుపెట్టడానికి మారడోనా ఒక కారణం. మొదటి రౌండులో దక్షిణ కొరియా మీద, రెండవ రౌండులో ఉరుగ్వే మీద గెలిచి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండు మీద పోటీకి సిద్ధమయింది అర్జెంటీనా.

ఇంగ్లాండు, అర్జెంటీనాల మధ్య ఫుట్‌బాల్ వైరమే కాకుండా, అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితం 1982లో అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫాక్ లాండ్ దీవులకోసం జరిగిన యుద్ధం కూడా మరింత వైరం పెంచింది. ఆ యుద్ధంలో అర్జెంటీనా ఓటమికి ఫుట్‌బాల్ మైదానంలో ప్రతీకారం తీర్చుకోవాలని అర్జెంటీనా అభిమానులు కోరుకున్నారు.

మెక్సికో నగరంలోని అజ్టెకా స్టేడియంలో జూన్ 22న జరిగిన మ్యాచ్ ప్రధమార్ధంలో ఇరు జట్లు గోల్ సాధించడం కన్నా ప్రత్యర్థి జట్టు గోల్ సాధించకుండా ఆపే ఆత్మరక్షణ వ్యూహం అవలంభిఓచడంతో ఎవరూ గోల్ సాధించలేకపోయారు.

సెకండ్ హాఫ్ మొదలైన ఆరవ నిమిషంలో ఇంగ్లాండు ఆటగాళ్ల నుంచి ఒడుపుగా బంతిని అందిపుచ్చుకుని సహచరుడు జోర్జ్ వాల్డానాకి అందించి, ముందుకు దూసుకుపోయాడు మారడోనా. అతను ఇంగ్లాండు ఆటగాళ్లకి బంతి అందకుండా ప్రత్యర్థి గోల్ పోస్టు వైపు దూసుకుపోతుండగా ఇంగ్లాండు ఆటగాడు స్టీవ్ హాడ్జ్ బంతిని చేజిక్కించుకుని, అర్జెంటీనా ఆటగాళ్ల దాడిని ఆపాలని తమ గోల్ కీపర్ వైపుకి కొట్టాడు. అప్పుడే ఇంగ్లాండు పెనాల్టీ ఏరియాకి చేరుకున్న అయుదడుగుల అయిదు అంగుళాల ఎత్తు ఉన్న డీగో మారడోనా, ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉన్న ఇంగ్లాండు గోల్ కీపర్ పీటర్ షిల్టన్ ఇద్దరూ ఒకేసారి గాలిలోకి ఎగిరారు. బంతిని పట్టుకుని అర్జెంటీనా ఆటగాళ్ల దాడిని నిర్వీర్యం చేయాలని ఇంగ్లాండు గోల్ కీపర్ ఉద్దేశం అయితే, తలతో కొట్టి బంతిని ఇంగ్లాండు గోల్ పోస్టులోకి పంపాలని మారడోనా ఉద్దేశం. అయితే బంతి మారడోనా తలకి కాకుండా ఎడమచేతికి తగలడంతో ఒడుపుగా పిడికిలితో గోల్ పోస్టులోకి పంపాడు మారడోనా.

నిజానికి రిఫరీ గోల్ చెల్లదని ప్రకటించి, చేతితో కొట్టినందుకు ఫౌల్ చేసి, మారడోనాకి ఎల్లో కార్డు చూపించి ఉండాలి. అయితే మారడోనా చేతితో గోల్ కొట్టడం కనిపించక గోల్ సక్రమం అని రిఫరీ ప్రకటించాడు. ఆ నిర్ణయానికి ఇంగ్లాండు ఆటగాళ్లు అభ్యంతరం చెప్పడంతో రిఫరీ లైన్స్ మాన్ ని సంప్రదించాడు. అతనికి కూడా మారడోనా చేయి బంతికి తగలడం కనిపించకపోవడంతో గోల్ ఇచ్చాడు రిఫరీ.

కొన్ని నిమిషాల తర్వాత మైదానం మధ్యలో బంతిని చేజిక్కించుకుని అయిదు మంది ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించుకుని ఒక్కడే గోల్ కొట్టి స్కోరు 2-0 చేశాడు మారడోనా. ఈ రెండవ గోల్ ఫిఫా వెబ్సైట్ పెట్టిన ఒక పోల్ లో గోల్ ఆఫ్ ది సెంచరీగా ఎన్నికైంది. ఆ తరువాత ఇంగ్లాండు ఒక గోల్ సాధించినా అర్జెంటీనా 2-1 స్కోరుతో విజయం సాధించింది. సెమీ ఫైనల్లో బెల్జియంతో జరిగిన పోటీలో మారడోనా రెండు గోల్స్ సాధించి 2-0 స్కోరుతో జట్టుని గెలిపించాడు. జర్మనీతో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 2-2 స్కోరు వద్ద, చివరి క్షణాల్లో తన సహచరుడికి అద్భుతమైన పాస్ అందించి అర్జెంటీనా జట్టు ప్రపంచ కప్ గెలవడానికి కారణమయ్యాడు.

హ్యాండ్ ఆఫ్ గాడ్…

ఇంగ్లాండు మీద చేసిన హ్యాండ్ గోల్ ఆ తర్వాత రోజుల్లో చాలా చర్చకు దారి తీసింది. ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు “మారడోనా తల, దేవుడి చేయి కలిసి సాధించిన గోల్ అది” అని సమాధానం చెప్పాడు మారడోనా. అప్పటినుంచి ఆ గోల్ “హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్” అయింది.

అయితే దేవుడు చేతితో కొట్టిన గోల్ అందుకున్న మారడోనా, తన జీవితంలో దేవుడు అందించిన చేతిని అందుకోలేకపోయాడు. మాదక ద్రవ్యాలకు బానిసగా మారి అనేక సార్లు ఫుట్‌బాల్ ఆడకుండా నిషేధానికి గురయి తన కెరీర్ తనే నాశనం చేసుకుని, చాలాసార్లు మరణానికి చేరువయి బయటపడిన మారడోనా అరవై ఏళ్ల వయసులో మరణించి ఫుట్‌బాల్ ప్రియులను విషాదంలో ముంచెత్తాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి