iDreamPost

పాతదైతేనే మోజుపడుతున్నారా..!

పాతదైతేనే మోజుపడుతున్నారా..!

దేశ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడంలో ఆటో రంగం కీలకమైనదంటుంటారు ఆర్ధిక నిపుణులు. ఆటో రంగంలో కొనుగోళ్ళను బట్టి ఆర్ధికరంగ క్రియాశీలతను అంచనా వేస్తుంటారు. అయితే కోవిడ్‌ పుణ్యమాని కొత్తగా కార్లు, ఇతర వాహనాలు కొనేవారు గణనీయంగా తగ్గారట. ఇందుకు భిన్నంగా వినియోగించిన వాహనాలు అంటే సెకెండ్‌ హేండ్‌ వాహనాలు కొనేందుకు ఆసక్తిచూపిస్తున్నట్టు అంచనాలు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనే ఇదే పంథా కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.

నిజానికి సెకెండ్‌ హేండ్‌ వాహనాల అమ్మకాలకు సంబంధించిన గణాంకాలు ఖచ్చితంగా గతంలో వెలువడేవి కాదు. అయితే పేరొందిన కార్పొరేట్‌ కంపెనీలు కూడా సెకెండ్‌ హేండ్‌ వాహన అమ్మకాల రంగంలోకి కాలుమోపడంతో ఇప్పుడీ గణాంకాలు కొంచెం అటూ ఇటూగా వెల్లడవుతున్నాయి. ఇటువంటి కార్పొరేట్‌ కంపెనీల అంచనాల మేరకు సెకెండ్‌ హేండ్‌ వాహనాలు, అందులోనూ కార్ల అమ్మకాలు కోవిడ్‌ సమయంలో ఊపందుకుంటున్నాయని నిర్ధారిస్తున్నారు. సెకెండ్‌ హేండ్‌కార్లకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతోందని, అందుకు అనుగుణంగా వాటి ధరలకు కూడా పైపైకి సాగుతున్నాయని వివరిస్తున్నారు. ఒకప్పుడు సెకెండ్‌ హేండ్‌ కారు కొనుగోలు చేయాలంటే అమ్మకందారుడు, మెకానిక్‌ మాటపై నమ్మకంతో కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు కార్పొరేట్‌ కంపెనీలు ఇందులోకి అడుగుపెట్టడం, పాతవాటికి కూడా గ్యారెంటీలు కూడా ఇస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులు అటువైపు అడుగులు వేస్తున్నారు. వీరు కాకుండా సంప్రదాయ అమ్మకందారులు కూడా అమ్మకాల బిజీలో ఉంటున్నారు.

అయితే కోవిడ్‌ కారణంగా ఆర్ధికంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ సెకెండ్‌ హేండ్‌ కార్ల అమ్మకాలు పెరగడానికి కారణం ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రంగంలో నిపుణులు చెప్పేదేంటంటే.. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్దగా ఇష్టపడడం లేదట. అందువల్లే సొంత వాహనాలవైపు మొగ్గుతున్నారని అంచనా వేస్తున్నారు. అయితే కొత్తకార్లు కొనుక్కోగలిగే పరిస్థితులు లేకపోవడంతో సెకెండ్‌హేండ్‌ కార్లవైపు మొగ్గుచూపుతున్నారని భావిస్తున్నారు.

ఈ యేడాది ప్రారంభంలో కొన్ని రకాల మోడల్స్‌ సెకెండ్‌హేండ్‌ కార్లు లక్షరూపాయల్లోపు ధర పలికేకార్లు ఇప్పుడు ఒకటిన్నరలక్షగా చెబుతున్నారు. దీనిపై రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాల్లోని సెకెండ్‌హేండ్‌ కార్ల అమ్మకాలు చేసేవారిని సంప్రదిస్తే ప్రస్తుతం యూజ్డ్‌కార్లను ఎక్కువగా అడుతుగుతున్నారని వివరిస్తున్నారు. లక్ష రూపాయలకు అటూఇటూగా కారు కొనుక్కునేందుకు ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. అత్యధికం అంటే మూడు లక్షల్లోపు కార్లకు ఎక్కువగా కొనుగోలుదారులు ఆసక్తిచూపిస్తున్నారని వివరిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు ఆగిపోతాయని కొంత మంది ఆలోచిస్తున్నారని, లేకపోతే మరింత మంది సెకెండ్‌హేండ్‌ కార్లు కొనుక్కునేందుకు సిద్దమవుతారని వారు చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు కారు అమ్మకుండానే గడిచిపోయేదని, అయితే ఇప్పుడు దానికి భిన్నంగా కార్లను అమ్ముతున్నట్టు వివరిస్తున్నారు. కరోనా ద్వారా వచ్చిన మార్పుల్లో దీనిని కూడా పరిగణించొచ్చని చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి