iDreamPost

Fake Accounts : నకిలీ ఖాతాల మీద లైవ్ డిబేట్లు – ఇది ట్విస్ట్ అంటే

Fake Accounts : నకిలీ ఖాతాల మీద లైవ్ డిబేట్లు – ఇది ట్విస్ట్ అంటే

సోషల్ మీడియాకు చాలా సార్లు విచక్షణ ఉండదు. వైరల్ అయ్యే అవకాశం ఉందని తేలిన ఏ విషయాన్నీ అంత తేలిగ్గా విడిచి పెట్టదు. నిజం తెలిసేలోపే దాన్ని ప్రపంచం అంచుల దాకా తీసుకెళ్లి పరిచయం చేస్తుంది. ఎందుకంటే దానికి వాస్తవాలు అక్కర్లేదు. ఫేక్ అకౌంట్లతో ఎవరినో టార్గెట్ చేసి పబ్బం గడుపుకునే డబ్బా రాయుళ్లు లక్షల్లో కాదు కోట్లలో ఉంటారు. కాకపోతే వాస్తవాలు గుర్తించాల్సింది వాటిని ఫాలో అయ్యేవాళ్ళు. సామాన్యులు అంటే అది వేరే సంగతి. కానీ ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాల్సిన న్యూస్ ఛానల్స్ సైతం వీటి ఉచ్చులో పడుతున్నాయంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఉదంతం.

ఏపిలో టికెట్ రేట్లు నాలుగు షోల వ్యవహారానికి సంబంధించి ఇంటా బయట హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో ఒక వ్యక్తి త్రివిక్రమ్ పేరు మీద ట్విట్టర్ లో ఒక నకిలీ ఖాతా తెరిచాడు. ప్రశ్నిస్తున్నట్టుగా అందులో కొన్ని పాయింట్లు పొందుపరిచాడు. అంతే ముందు వెనుకా చూసుకోకుండా అది నిజంగా ఆయనే ట్వీట్ చేశాడా లేదా అని చెక్ చేసుకోకుండా కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా లైవ్ డిబేట్లు నిర్వహించాయి. పాల్గొనేందుకు వచ్చిన అతిధులు కూడా అది నిజంగా త్రివిక్రమ్ ట్వీట్ అని నమ్మేసి గంటల తరబడి వాటిలో స్పీచులు, లెక్చర్లు ఇచ్చేశారు. ఇది కాస్తా ముదురుతుండటంతో అప్పుడు అసలు ట్విస్ట్ బయటికి వచ్చింది

నిజానికి త్రివిక్రమ్ కు ట్విట్టర్ అకౌంట్ లేదు. ఒకవేళ ఆయన కోరుకుంటే సదరు సంస్థ బ్లూ వెరిఫైడ్ టిక్ మార్క్ తో అధికారిక ఖాతా ఇస్తుంది. కానీ ఏవో కారణాల వల్ల ఆయన దాని మీద ఆసక్తి చూపించలేదు. ఆఖరికి ప్రొడక్షన్ సంస్థ స్వయంగా తన హ్యాండిల్ ద్వారా నకిలీల ఉచ్చులో పడవొద్దని హెచ్చరించింది. అయినా ఇలా గుడ్డిగా ప్రోగ్రాంల కోసం డూప్లికేట్ ట్విట్టర్ అకౌంట్లను గుర్తించకుండా ఏకంగా వాటి మీద కార్యక్రమాలు చేయడమే అర్థం కాని భలే వింత. కొందరు ప్రముఖులు అస్వస్థతలో ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోయారంటూ RIPలు పెట్టే వికార పైత్యాలు కూడా ఎక్కువవుతున్నాయి

Also Read : Brahmastra : మూడు భాగాల మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి