iDreamPost

నంద్యాలలో భారీ చోరీ.. రూ. 1.3 కోట్లు విలువ చేసే సెల్ ఫోన్లు మాయం

నంద్యాలలో భారీ చోరీ.. రూ. 1.3 కోట్లు విలువ చేసే సెల్ ఫోన్లు మాయం

సాధారణంగా దొంగలు ఇళ్లు, షాపులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు. లేదంటే జేబులు కత్తిరిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో బహిరంగ ప్రాంతాల్లోనే దర్జాగా దోపిడీకి దిగుతున్నారు. రోడ్డుపై ఉన్న వస్తువులను, వాహనాలను కూడా వదలడం లేదు. మొన్నామధ్యలో ఏకంగా సెల్ ఫోన్ టవర్స్‌కే ఎసరు పెట్టిన సంగతి విదితమే. అందరూ చూస్తుండగానే కొట్టేశారు. అంతకన్నా ముందు బ్రిడ్జీని దొంగిలించిన ఘరానా దొంగల గురించి కూడా విన్నాం. తాజాగా తెలంగాణలోని సిద్దిపేటలో బస్సులో ప్రయాణీకులు ఉండగానే.. ఓ దొంగ ఆర్టీసీ బస్సును అపహరించాడు. ఈ సంఘటనలు అన్నీ మర్చిపోక ముందే ఇప్పుడు నడి రోడ్డుపై భారీ దొంగతనం  చోటుచేసుకుంది. ఏకంగా కోట్ల విలువ చేసే సెల్ ఫోన్ కంటైనర్ చోరీకి గురైంది.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై జరిగింది. హర్యానా నుండి బెంగళూరుకు 1.3 కోట్ల విలువైన సెల్ ఫోన్లను తీసుకెళుతోంది కంటైనర్ లారీ. నంద్యాల హైవే ఓబులాపురం మిట్ట సమీపంలోకి రాగానే.. వాహనాన్ని రోడ్డు ప్రక్కగా ఆపారు డ్రైవర్లు. అందులోని సెల్ ఫోన్లను మరొక వాహనంలోకి మార్చేసి.. కంటైనర్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. అయితే లారీ డ్రైవర్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ వాహన యజమాని డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రక్కగా నిలిపి ఉన్న వాహనాన్ని గుర్తించి తనిఖీ చేయగా.. సెల్ ఫోన్లు చోరీ అయినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు హర్యానా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఆంధ్రాకు తరలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి