iDreamPost

ధనుష్ క్రేజ్ కు అసలు కారణం

ధనుష్ క్రేజ్ కు అసలు కారణం

ధనుష్ తమిళంలో ఎంత పెద్ద స్టార్ అయినా కావొచ్చు గాక. రజనీకాంత్ అల్లుడు అనే బ్రాండ్ ఉండొచ్చు. అసురన్, కర్ణన్ లాంటి అద్భుతమైన సినిమాలు చేసుండొచ్చు. కానీ సగటు తెలుగు ప్రేక్షకులకు అతని గురించి తెలిసింది తక్కువే. ఒక్క రఘువరన్ బిటెక్ మాత్రమే చెప్పుకోదగ్గ గుర్తింపు ఇచ్చింది. అరవంలో జాతీయ అవార్డు తెచ్చిన చిత్రాన్ని ఇక్కడ పందెం కోళ్లు టైటిల్ తో రిలీజ్ చేస్తే మొన్నెప్పుడో టీవీలో వచ్చే దాకా అదుందన్న సంగతి కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. తను అక్కడ చేసిన చాలా ఫీల్ గుడ్ మూవీస్ ఇక్కడ కనీసం యావరేజ్ కూడా కాలేకపోయాయి. నవమన్మథుడు దానికి మంచి ఉదాహరణ.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన నిర్మాతలు తనతో సినిమాలు చేసేందుకు ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు సిద్ధం కావడమే. ఇటీవలే శేఖర్ కమ్ముల కాంబోలో ఆసియన్ సంస్థ భారీ ప్రాజెక్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సితారా బ్యానర్ సైతం షాకింగ్ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసి మరీ తనతో పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమవుతోందట. అఫీషియల్ గా రాలేదు కానీ ఈ వార్త గట్టిగానే షికారు చేస్తోంది. ఎంత మల్టీ లాంగ్వేజ్ మూవీ అయినా కూడా ధనుష్ కి సోలోగా తెలుగులో పాతిక కోట్లయినా తెచ్చే మార్కెట్ లేదు. ఎవరో ఎందుకు రజనీకాంత్ వల్లే ఆ ఫిగర్ సాధ్యం కావడం లేదు.

అలాంటప్పుడు ధనుష్ కు ఇంత క్రేజ్ ఎందుకొచ్చిందనే అనుమానం రావొచ్చు. ధనుష్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాని మీద ఇప్పటికే భారీ బజ్ ఉంది. వచ్చే ఏడాది నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. హిందీలో అక్షయ్ కుమార్ తో చేస్తున్న మల్టీ స్టారర్ అత్ రంగీరే కూడా చివరి దశలో ఉంది. ఇలా బాషా బేధం లేకుండా ధనుష్ ఇంటర్నేషనల్ నుంచి లోకల్ దాకా అన్ని సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఈ అంశాన్ని క్యాష్ చేసుకంటే ధనుష్ సినిమా మంచి లాభాలు ఇస్తుందనే లెక్కల్లో నిర్మాతలు ఉన్నారు. చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి