iDreamPost

కొవిడ్ కేంద్రాలుగా సీపీఎం కార్యాల‌యాలు

కొవిడ్ కేంద్రాలుగా సీపీఎం కార్యాల‌యాలు

ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడే సీపీఎం క‌రోనా కాలంలో బాధితుల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తోంది. మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇంట్లో వ‌స‌తులు లేని వారి కోసం త‌మ పార్టీ కార్యాల‌యాల‌ను కొవిడ్ కేంద్రాలుగా మారుస్తోంది. క‌మ్యూనిస్టు పార్టీ కార్యాల‌యాల‌ను కొవిడ్ సెంట‌ర్లు గా మార్చ‌నున్న‌ట్లు బీవీ రాఘువులు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగా విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు. కోవిడ్ సోకి ఆదరణ లేనివారికి, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండటానికి విలులేని వారి కోసం బంద్‌రోడ్డులోని బాలోత్సవ భవన్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను అందుబాటులో ఉంచారు.

వైద్యుల పర్యవేక్షణలో కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ ప్రతీరోజూ కరోనా రోగులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు వ్యాయమం చేయిస్తున్నారు. పౌష్టిక ఆహారం, ఒక గ్లాసు పాలతో పాటు కోడి గుడ్లు అల్పాహారం ఇస్తున్నారు. మధ్యహ్నాం రెండు కూరలు ఒక రసంతో వేడివేడి భోజనం పెడుతున్నారు. కరోనా రోగం నయమయ్యేంత వరకు చికిత్స చేస్తున్నారు. అయితే చికిత్సకు డబ్బులు తీసుకోవడం లేదని…కరోనా ప్రభావం మొదలైప్పటి నుంచి ఉచితంగా సేవలు అందిస్తున్నామని నిర్వహకుడు మురళి చెప్తున్నారు. కరోనా రోగులకు సేవ చేయడం చాలా సంతోసంగా ఉందని సీపీఎం నేతలు అంటున్నారు. కరోనా సోకి ఎవరి ఆదరణలేని వారికి మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నామని… అంతే కాకుండా నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని చెప్తున్నారు.

క‌రోనా మొద‌టి ద‌శ‌లో కూడా 250 మంది కరోనా బాధితులకు ఉచితంగా సేవ చేశామని, మ‌ళ్లీ కరోనా సెకండ్ వేవ్‌లో వైద్యం అందుబాటులో ఉంచామని సీపీఎం కార్మిక సంఘాల నేత ముజఫార్ అన్నారు. తొమ్మిది మంది నర్సులతో పాటు మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్ల పర్యవేక్షణలో సేవా ధృక్పథంతో పని చేస్తున్నామని డాక్టర్ మాకినేని కిరణ్ అన్నారు. ఉదయం సాయంత్రం వైద్యులు రోగులకు పరీక్షలు చేయడంతో పాటు యోగా, వ్యాయమం చేయిస్తున్నారని చెప్పారు. కరోనాకు చికిత్స తీసుకుని కోలుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఎంతో సేవ చేశారని అంటున్నారు. సీపీయం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాన్ని చేపట్టడాన్ని అభినందిస్తున్నారు. విజ‌య‌వాడ కేంద్రంలోనే కాకుండా కొవిడ్ సెంట‌ర్ గా క‌నీసం కొంత మందికైనా ఆశ్ర‌యం ఇవ్వ‌గ‌లిగే కార్యాల‌యాలు అన్నింటినీ అందుబాటులో తెచ్చే ప్ర‌య‌త్నాల‌ను సీపీఎం నాయ‌క‌త్వం చేస్తోంది. కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ప‌లువురి మ‌న్న‌న‌లు పొందుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి