iDreamPost

సుబ్బరాజు మృతి బెజవాడకు నష్టమే

సుబ్బరాజు మృతి బెజవాడకు నష్టమే

మాజీ శాసనసభ్యుడు, ప్రముఖ కమ్యూనిస్టు నేత కాకర్లపూడి సుబ్బరాజు మృతి చెందారు. విజయవాడ నగర పాలక సంస్థలో సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పనిచేసిన సుబ్బరాజు 1994లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు.

శాసనసభ్యునిగానూ, అంతకు ముందు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా, ప్రతిపక్ష నేతగా సుబ్బరాజు నగరాభివృద్ధికి విశేష కృషి చేశారు. నగరంలో కమ్యూనిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉభయ కమ్యూనిస్టులు ఐక్యంగా పనిచేస్తున్న రోజుల్లో సుబ్బరాజు నగర అభివృద్ధికి పెద్దఎత్తున కృషి చేశారు. నగరాభివృద్ధికి తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఆయన పాత్ర విస్మరించలేనిది.

1982లో నగరపాలక సంస్థ ఏర్పడిన నాటి నుండి కమ్యూనిస్టులు అనేక దఫాలు అధికారంలో ఉన్నారు. మొదటి మేయర్ టి వెంకటేశ్వర రావుకు ధీటుగా డిప్యూటీ మేయర్ హోదాలో నగరాభివృద్ధికి విశేష కృషి చేశారు. అప్పట్లోనే విజయవాడ నగరంలో విలీనం అయిన పటమట, గుణదల, కండ్రిక గ్రామ పంచాయితీల అభివృద్ధికి సుబ్బరాజు చేసిన ప్రతిపాదనలు నాగరాభివృద్ధిపట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తాయి.

ఆ తర్వాత 1990 దశకంలో డాక్టర్ జంధ్యాల శంకర్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సుబ్బరాజు ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు. అప్పట్లో విజయవాడ నగరపాలక సంస్థ సమావేశాలు రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ధీటుగా సాగేవి. అనేక అంశాలపై, ప్రత్యేకించి స్థానిక సంస్థల అధికారాలు, నిధులు, విధులు వంటి అంశాలపై టి వెంకటేశ్వర రావు తో కలిసి పెద్దఎత్తున చర్చ చేసే వారు సుబ్బరాజు.

Also Read : . జనసేన అధినేతకు కరోనా

తెలుగుదేశం పార్టీతో పొత్తుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి 1994లో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత సుబ్బరాజు విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తేవడంలో విశేష కృషి చేశారు. అలాగే సింగ్ నగర్ రైల్వే లైన్ పై వంతెన నిర్మించడం ఆయన కృషివల్లనే సాధ్యం అయింది. ఈ ఫ్లైఓవర్ విజయవాడ నగరానికి మొదటి వంతెన. విజయవాడ నగరం సింగ్ నగర్ వైపు విస్తరిస్తున్న దశలో, విశాఖపట్నం, కోల్కతా రైల్వే లైన్ కారణంగా తరచుగా గేటు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న రోజుల్లో సుబ్బరాజు తీవ్రంగా కృషి చేసి వంతెన సాధించారు.

సింగ్ నగర్ ఫ్లై ఓవర్ తర్వాతనే ఇతర ఫ్లై ఓవర్ లు నగరానికి వచ్చాయి. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద, పాల ఫ్యాక్టరీ వద్ద, రామవరప్పాడు రింగ్ వద్ద ఫ్లై ఓవర్ లు వచ్చాయి. ఇటీవలే బెంజి సెంటర్ లో, కనకదుర్గ గుడి వద్ద మరో రెండు ఫ్లై ఓవర్ లు నిర్మించారు. సుబ్బరాజు ముందు చూపు అటువంటిది.

ఇక ఒకదఫా శాసనసభ్యుడిగా పనిచేసిన సుబ్బరాజు మాజీ శాసనసభ్యుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి మాజీ శాసనసభ్యులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. అంతే కాదు మాజీ శాసన సభ్యులకు పెన్షన్ పెంచడంలోనూ, ప్రోటోకాల్ లో మార్పులు చేయడంలోనూ సుబ్బరాజు కృషిని పలువురు మాజీ శాసనసభ్యులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

సిపిఐ నగర శాఖ కార్యదర్శిగా రెండు దఫాలు పనిచేసిన సుబ్బరాజు ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా కీలక పాత్ర పోషించారు. నగరం పట్ల, నగర అభివృద్ధి పట్ల నిరంతరం ఆలోచనలు చేసే సుబ్బరాజు వంటి నేత అకాల మరణం నగరానికి, అలాగే కమ్యూనిస్టు ఉద్యమానికి నష్టం అని చెప్పక తప్పదు.

Also Read : మరో మాజీ మంత్రిని బలితీసుకున్న కరోనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి