iDreamPost

దేశంలో 531 జిల్లాల్లో కరోనా టెస్టింగ్‌ ల్యాబుల్లేవ్‌ : ఐసిఎంఆర్ రిపోర్టులో తేటతెల్లం

దేశంలో 531 జిల్లాల్లో కరోనా టెస్టింగ్‌ ల్యాబుల్లేవ్‌ : ఐసిఎంఆర్ రిపోర్టులో తేటతెల్లం

దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా కేసుల సంఖ్య లక్షన్నరకు చేరింది. మృతులసంఖ్య నాలుగువేలపైనే దాటింది. కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతున్న విధంగా.. టెస్టింగ్‌ కేంద్రాలూ పెరగాలి. కానీ గత వారం రోజుల నుంచి పరిశీలించినట్టయితే.. ప్రతిరోజూ లక్ష టెస్టులు మాత్రమే చేస్తున్నారు. మే 26 వరకు 31.26 లక్షలకు పైనే కరోనా పరీక్షలు చేసినట్టు అధికార గణాంకాలు ధ్రువీకరి స్తున్నాయి.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చీ (ఐసిఎంఆర్‌) “తమ దృష్టంతా కోవిడ్‌-19 పరీక్షలపై ఉంది” అని ప్రకటించింది. వాస్తవ పరిస్థితులేంటీ..? ల్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి..? దీనిపై ఆరా తీస్తే..

దేశంలో ఉన్న ల్యాబ్‌లు..

ఐసిఎంఆర్‌ రిపోర్టు ప్రకారం.. మే 26 వరకు దేశ వ్యాప్తంగా ఆర్టీపిసిఆర్‌ పరీక్షలు నిర్వహించటానికి కేవలం 453 ల్యాబులు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం నడుపుతున్నవి 304 కాగా.. 149 ప్రయివేట్‌ ల్యాబులున్నాయి. ఆర్టీపిసిఆర్‌ టెస్టులే కాకుండా..105 సిబిఎన్‌ఏటి టెస్టులకు మరో 54 ల్యాబులున్నాయి. అయితే కరోనా నిర్థారణకు మాత్రం ఆర్టీపిసిఆర్‌ పరీక్షలు అన్నింటికంటే కీలమైనవి.ఈ లెక్కన దేశంలోని 531 జిల్లాల్లో కోరనా వైరస్‌ నిర్థారణకు ఆర్టీపిసిఆర్‌ టెస్టింగ్‌ ల్యాబులు లేవు. దేశంలోని 37 రాష్ట్రాల్లో 733 జిల్లాలు ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న 717 జిల్లాల డేటా ప్రకారం..186 జిల్లాల్లో అసలు టెస్టింగ్‌ ల్యాబులేలేవు. మరి కొన్ని జిల్లాల్లో ఒకటికి మించి లేవు. ఇక మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుంటే…అక్కడ ఆర్టీపిసిఆర్‌ టెస్టింగ్‌లు జరపటానికి కేవలం తొమ్మిది పరీక్ష కేంద్రాలు మాత్రమే ఉన్నాయి.

తెలంగాణలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలుండగా.. టెస్టింగ్‌ ల్యాబ్‌లు కేవలం మూడు మాత్రమే ఉండటం గమనార్హం. కాగా, కేరళలో 14 జిల్లాలకుగాను 11 టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఉండటం విశేషం.

717 జిల్లాల్లో 427 జిల్లాల పరిస్థితిని గమనించినట్టయితే.. ఆ జిల్లాల్లో కనీసం ఒక్కరికి కరోనా సోకినా.. అక్కడ కూడా వ్యాధి నిర్థారణ జరపాలి. కానీ ఇక్కడ అలాంటి టెస్టింగ్‌ ల్యాబుల్లేవ్‌. ఇలాంటి జిల్లాల్లో కరోనా సోకిన వారికి పరీక్షలు జరిపినా..నిర్థారణ చేసిన రిపోర్టు రావటానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. ఆర్టీపిసిఆర్‌ టెస్టు కోసం సేకరించిన శాంపిల్స్‌ను ఇతర జిల్లాలకు పంపాల్సిఉంటుంది. మరోవైపు 104 జిల్లాల్లో కోవిడ్‌-19 సోకిన రోగులులేరు. టెస్టింగ్‌ ల్యాబులు కూడా లేవు.

ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశంలోని ప్రతి పదిలక్షల మందిలో కేవలం 32 మందికి మాత్రం నిర్థారణ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌ 30 తర్వాత 32 మంది నుంచి 616 మందికి పరీక్షలు జరిగినట్టు గుర్తించింది. ఇప్పటి వరకు అంటే.. మే 24 వరకు ఉన్న సమాచారం ప్రకారం..ప్రతి పదిలక్షల మందిలో 2,159 మంది చొప్పున కోవిడ్‌-19 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దీని ప్రకారం ఏప్రిల్‌ ఒకటి తర్వాత ప్రతి పదిలక్షల మందికి కరోనా పరీక్షలు జరపగా మే24 వరకు 70 శాతం మేర నిర్థారణ పరీక్షలు జరిగాయి.

లాక్‌డౌన్‌ ప్రకటించటానికి హడావుడిగా ప్రధాని మోడీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ముందుముప్పు తప్పదన్నట్టు ఐసిఎంఆర్‌ రిపోర్టు ధ్రువీకరిస్తున్నది. ఓ వైపు లాక్‌డౌన్‌ ఎత్తివేయటానికి దశల వారీగా కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలిస్తూ… మరోవైపు పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులను గుర్తించటానికి అవసరమైన ల్యాబుల ఏర్పాటు విషయంలో మోడీ ప్రభుత్వం లైట్‌ తీసుకుంటున్నదని స్పష్టమవుతున్నది. ప్రజల ప్రాణాల కన్నా.. కార్పొరేట్‌ వర్గాలకు మేలు చేకూర్చటమే తమ కర్తవ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దేశంలో పది రాష్ట్రాల్లో కరోనా కోరలు విప్పింది. మే 26 వరకు మహారాష్ట్రలో 52,667 కేసులు నమోదయ్యాయి. ఇక్కడి 36 జిల్లాల్లో కేవలం 16 చోట్ల మాత్రం ఆర్టీపిసిఆర్‌ ల్యాబులున్నాయి. మొత్తం పరీక్షా కేంద్రాలు 62 ఉన్నాయి. ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కూడా కోవిడ్‌-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దేశంలో కరోనా కేసుల అత్యధికంగా నమోదవుతున్న జాబితాలో తమిళనాడు రెండోస్థానంలో ఉన్నది. ఇక్కడి 32 జిల్లాల్లోని 28 చోట్ల 87.5 శాతం జిల్లాల్లో 65 టెస్టింగ్‌ ల్యాబులు ఉన్నాయి. కరోనా నిర్థారణ పరీక్షా కేంద్రాల సంఖ్యలో తమిళనాడు ప్రధమ స్థానంలో ఉన్నది.

ఇక గుజరాత్‌ విషయానికొస్తే..దేశానికే మోడల్‌ స్టేట్‌ ఇదనీ బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కరోనా టెస్టింగ్‌ ల్యాబుల సంఖ్య తక్కువగానే ఉన్నది. గుజరాత్‌లో 33 జిల్లాల్లో కేవలం పది ల్యాబులు మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం. ఇక ఆ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ల్యాబుల వెనుక బిజెపి నేతల హస్తం ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. జనం జేబులకు చిల్లు పెడుతున్న అక్కడి బిజెపి సర్కార్‌..ప్రజల ఆరోగ్యంపై కరోనా రూపంలో కాసులు దండుకునేలా వ్యవహరిస్తున్నదని గుజరాతీయులు ఆరోపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి