iDreamPost

షాకిచ్చే విషయం… కరోనా సైలెంట్‌ కిల్లర్‌

షాకిచ్చే విషయం… కరోనా సైలెంట్‌ కిల్లర్‌

మానవ జాతికి పెనుమప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ గురించి సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ వైరస్‌ సోకిన వారికి పొడి దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలుంటాయని ప్రపంచమంతా భావిస్తోంది. అయితే ఈ లక్షణాలు లేకున్నా కూడా వైరస్‌ మనిషిలో ఉంటుందని తాజాగా వెల్లడవడంతో ప్రభుత్వాలు, వైద్యుల్లో కొత్త టెన్షన్‌ మొదలైంది.

ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన 30 మంది విశాఖజిల్లా వాసులను క్వారంటైన్‌కు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా లక్షణాలేమీ లేకపోవడంతో వైరస్‌ ఉండదని వైద్యులు భావించారు. అయితే వారిలో ఐదుగురికి కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది. లక్షణాలు లేమీ లేకపోయినా కూడా పరీక్ష ఫలితాల్లో పాజిటివ్‌ రావడంతో వైద్యులు అవాక్కయ్యారు. ఐదుగురిలో ఒక వ్యక్తికి స్వల్పంగా ఒళ్లు నొప్పులున్నాయని అధికారులు గుర్తించారు. ఇది మినహా వారందరూ ఎలాంటి నలత లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు.

వైరస్‌ ఉన్నా కూడా లక్షణాలు బయటపడకపోవడంతో ఈ మహమ్మరిపై ఇంకా ఎంత కాలం పోరాటం చేయాల్సి వస్తుందనే ఆందోళన నెలకొంది. లక్షణాలు బయటపడితే.. వారందరినీ తీసుకొచ్చి పరీక్షలు చేసి, క్వారంటైన్‌ చేస్తున్నారు. భారత ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయడం, పాజిటివ్‌ ఉంటే.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పరీక్షలు చేయడం మాత్రమే ఇప్పటి వరకూ చేస్తున్నారు. అయితే తాజాగా లక్షణాలు లేకున్నా కూడా వైరస్‌ ఉండడం.. ఇది ఎటు దారితీస్తుందోనన్న భయం అందరిలోనూ నెలకొంది.

మరో వైపు లక్షణాలు ఉన్నా కూడా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. ఇదేదో జబ్బు అన్నట్లుగా భావిస్తూ, బయటకు తెలిస్తే పరువుపోతుందనే అపోహలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలే కాదు.. అర్భన్‌ ప్రాంతాల్లోని ప్రజలు ఇదే ధోరణిలో ఉన్నారు. ప్రజల్లో ఉన్న ఈ అపోహను తొలగించేందుకు సాక్షాత్తూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌నే వారిలో అవగాహణ కల్పించే ప్రయత్నం చేశారు. ఇది సాధారణ జ్వరం లాంటిది, వస్తే తగ్గిపోతుంది.. జ్వరానికి ఎలా చికిత్స తీసుకుంటామో.. దీనికి కూడా ఇలానే తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం, నిత్యం అప్రమత్తంగా ఉంటేనే సైలెంట్‌ కిల్లర్‌గా మారిన కరోనాను జయించగలం. లేదంటే ఇది ఎప్పటికి ముగుస్తుందో.. ఆ లోపు ఎంత నష్టం చేస్తుందో ఊహించలేము.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి