iDreamPost

నడిసముద్రంలో కార్డీలియా క్రూయిజ్‌ కు పుదుచ్చేరి సర్కార్‌ బ్రేక్‌, ఏం జ‌రిగింది?

నడిసముద్రంలో కార్డీలియా క్రూయిజ్‌ కు పుదుచ్చేరి సర్కార్‌ బ్రేక్‌, ఏం జ‌రిగింది?

విలాసవంతమైన నౌక కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. విశాఖపట్నం నుంచి బయల్దేరిన కార్డీలియో క్రూయిజ్‌ను తమ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) చెప్పారు. టూరిజంను అభివృద్ధి చేయాలనే ఆసక్తితో ఉన్నా, మన సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని తమిళిసై స్పష్టం చేశారు. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి సముద్రంలోనే షిప్ ఉండిపోయింది. పుదుచ్చేరి అధికారులు కూడా ఈ క్రూయిజ్‌ గురించి సమాచారం అందలేదని అంటున్నారు. క్రూయిజ్‌లో కేసీనో, గ్యాంబ్లింగ్‌ ఉండటంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

ప్ర‌స్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో క్రూయిజ్‌ ఆపరేట్లు చర్చలు జరుపుతున్నారు. ఒక‌వేళ‌ పాండిచ్చేరి అనుమతించకపోతే, 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని, కడులూరు పోర్ట్‌లో హాల్ట్ చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళనాడు ప్రభుత్వం సీ టూరిజం కంపెనీతో కలిసి లగ్జరీ క్రూయిజ్ టూర్‌ను ప్రారంభించింది. ఈ లగ్జరీ క్రూయిజ్ ప్లాన్‌లు 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు. తమిళనాడు పర్యాటక శాఖ కార్డిలియా అనే షిప్పింగ్ కంపెనీతో కలిసి లగ్జరీ క్రూయిజ్ లైనర్‌ను ప్రారంభించింది. ఇదో విలాసవంతమైన క్రూయిజ్ లైనర్. చెన్నై నుంచి పాండిచ్చేరి, విశాఖపట్నంకు క్రూయిజ్ షిప్‌లో ప్రజలను తీసుకెళ్లడానికి తీర్చిదిద్దారు.

ఈ లగ్జరీ కార్డీలియా క్రూయిజ్ షిప్, బుధవారం ఉదయం వైజాగ్ పోర్టుకు చేరుకుంది. మొత్తం 1,900 మందికిపైగా పర్యాటకులు వైజాగ్ చేరుకున్నారు. ఇక్క‌డ నుంచి ఈ క్రూయిజ్ పుదుచ్చేరి, చెన్నైకు వెళ్తుంది. కాని, విశాఖపట్నం నుంచి బయల్దేరిన ఈ క్రూయిజ్ షిప్‌కు పుదుచ్చేరిలోకి అనుమతి నిరాకరించారు. కార్డీలియా క్రూయిజ్ కంపెనీ నడిపే ఈ షిప్ స్టార్ హోటల్‌ను తలపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి