iDreamPost

ముదురుతున్న రాహుల్ గాంధీ ‘ప్లయింగ్ కిస్’ వివాదం!

ముదురుతున్న రాహుల్ గాంధీ ‘ప్లయింగ్ కిస్’ వివాదం!

రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సభలో ఉన్న మహిళా ఎంపీలను చూస్తూ రాహుల్ గాంధీ అలా చేశారంటూ స్మృతీ ఇరానీ ఆరోపణలు చేయడం చూశాం. రాహుల్ పై బీజీపే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ తర్వాత మహిళా ఎంపీలతో కలసి స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వివాదంపై బిహార్ కు చెందిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే నీతూ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నీతూ సింగ్ మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి అనుకుంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ఏమైనా కరువయ్యారా? 50 ఏళ్ల ఈ ముసలి వాళ్లకు ఫ్లయింగ్ కిస్ ఇస్తారా? బీజేపీ ఎంపీలు చేసేవి అన్నీ నిరాధార ఆరోపణలు” అంటూ నీతూ సింగ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ కామెంట్స్ కి సంబధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే మహిళా వ్యతిరేక కాంగ్రెస్ రాహుల్ గాంధీ చర్యను సమర్థిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.

రాహుల్ గాంధీ అలా చేయడం తప్పు అంటూ అప్పటి నుంచే బీజేపీ ఎంపీలు, శ్రేణులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అందరూ కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మహిళలను గౌరవించని, మర్యాద ఇవ్వని వాళ్లే మహిళా సభ్యులు ఉండే సభలో ఇలా ప్రవర్తిస్తారంటూ స్మృతీ ఇరానీ కామెంట్స్ చేశారు. ఇప్పుడు బిహార్ ఎమ్మెల్యే నీతూ సింగ్ కామెంట్స్ ని కూడా బీజేపీ ఖండిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీతూ సింగ్ కామెంట్స్ పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవ్వాలి అంటే చాలా మంది అమ్మాయిలే ఉన్నారు అనడాన్ని తప్పబడుతున్నారు. ఇదేనా మీరు ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం అంటూ నీతూ సింగ్ ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం చినికి చినికి గాలివాన అయ్యేలా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సభలో తన చర్యలతో గతంలో కూడా రాహుల్ గాంధీ విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి