iDreamPost

టీడీపీతో పొత్తు : బీజేపీ ఇలా.. మ‌రి ప‌వ‌న్ ఎలా?

టీడీపీతో పొత్తు : బీజేపీ ఇలా.. మ‌రి ప‌వ‌న్ ఎలా?

బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం చూస్తున్నా.. అని ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చూస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో బీజేపీ, జ‌న‌సేన‌తో పాటు టీడీపీ కూడా క‌లిసే పోటీ చేస్తుంద‌న్న సంకేతాలు ఇచ్చారు. అయితే.. బీజేపీ అందుకు విరుద్ధంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. రెండురోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల అధ్య‌క్షులూ ఓ అంశంలో ఒకే నిర్ణ‌యాన్ని వెల్ల‌డించార‌ట‌. అది ఏంటంటే.. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని. రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్‌చార్జ్‌లు సునీల్‌ దియోధర్, మధుకర్‌ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలులోని మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్‌ హాలులో ఈ నెల 20, 21 తేదీలలో నిర్వహించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ సుప్రకాశ్, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్, మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, పదాధికారులు పాల్గొన్నారు. సమావేశం హాలులోకి మీడియాను కూడా అనుమతించలేదు. అయితే.. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బీజేపీ విధానం, పార్టీ బలోపేతం, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సిద్ధం కావడంతో పాటు పొత్తు అంశాలపై స‌మావేశంలో చర్చించారు.

చంద్రబాబునాయుడు బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బీజేపీతో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని 13 జిల్లాల అధ్యక్షులు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బీజేపీతో జతకట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారని చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండకూడదని 13 జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడిగా నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు ఉండదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. మ‌రి దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి