iDreamPost

గవర్నర్‌తో భేటీ కాబోతున్న సీఎం జగన్‌

గవర్నర్‌తో భేటీ కాబోతున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌తో భేటీ కాబోతున్నారు. ఐదు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఐదున్నర గంటలకు గవర్నర్‌తో సమావేశం కాబోతున్నారు. అర గంటలపాటు గవర్నర్‌తో సీఎం జగన్‌ సమావేశం కాబోతున్నారు. భేటీ ఖరారైన విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు జరగడం, అనంతరం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌తో సమావేశం కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ పక్క పండుగ వాతావరణంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పేరిట రాష్ట్ర ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. గత నెల 25వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంతో ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగబోతోంది. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఉండాలనే మహోన్నత లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ దేశ చరిత్రలో తొలిసారి భారీ సంఖ్యలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వబోతున్నారు. ఇలాంటి తరుణంలో సదరు కార్యక్రమాన్ని పక్కదొవ పట్టించేందుకు, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకే దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దేవాతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించడం గమనార్హం. కలియుగం క్లైమాక్స్‌కు చేరుకుందని, దిగజారుడు రాజకీయలకు పరాకాష్టగా దేవాలయాలపై దాడులను సీఎం జగన్‌ అభివర్ణించారు. తన ప్రభుత్వం ఎప్పుడు సంక్షేమ పథకాలు ప్రారంభించినా.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జగన్‌ ఈ రోజు ప్రస్తావించడం దేవాలయాలపై దాడుల అంశాన్ని ముఖ్యమంత్రి ఎంత సీరియస్‌గా తీసుకున్నారో తెలియజేస్తోంది.

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ, మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపణ, ఈ నెల 9వ తేదీన అమ్మ ఒడి రెండో విడత నగదు బదిలీ పథకం అమలు తదితర అంశాలను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి