iDreamPost

Chittemma Mogudu : విచిత్రమైన ట్విస్టుతో బోల్తా కొట్టిన డ్రామా – Nostalgia

Chittemma Mogudu : విచిత్రమైన ట్విస్టుతో బోల్తా కొట్టిన డ్రామా – Nostalgia

అరవ ప్రేక్షకుల అభిరుచులు ఆలోచనా విధానం సినిమాల విషయంలో మనకు కొంచెం దగ్గరగా అనిపించినా కొన్ని అంశాల్లో అతిని వాళ్ళు భరించినంతగా మనం తట్టుకోలేం. అందుకే అక్కడ హిట్ అయిన మూవీని పట్టుకొచ్చి ఇక్కడ గుడ్డిగా రీమేక్ చేసుకుంటే దెబ్బ పడటం ఖాయం. ఎలా అంటారా. ఓ ఉదాహరణ చూద్దాం. 1991లో ప్రభు కనక జంటగా రాజ్ కపూర్ దర్శకత్వంలో తమిళంలో ‘తాలాట్టు కేట్కుతమ్మ’ వచ్చింది. ఇది ఆ డైరెక్టర్ డెబ్యూ మూవీ. నటుడిగా అప్పటికే మంచి పేరు వచ్చింది తనకు. బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. చినతంబీ(చంటి)పుణ్యమాని ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన ప్రభుకి ఇది కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది.

అదే సమయంలో మోహన్ బాబు రీమేక్ కథల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ నాలుగు సూపర్ హిట్లు ఇతర బాషల నుంచి తీసుకున్నవే. బ్రహ్మ, అల్లరి మొగుడు షూటింగ్స్ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు వద్దకు పైన చెప్పిన తాలాట్టు కేట్కుతమ్మ రీమేక్ ప్రతిపాదన వచ్చింది. సరే అక్కడ ఆడేసింది కదాని కలెక్షన్ కింగ్ ఎక్కువ ఆలోచించలేదు. అన్ని అంశాలు ఉన్న ఫ్యామిలీ విలేజ్ డ్రామాగా అనిపించడంతో ఒప్పేసుకున్నారు. కాకపోతే స్వంతంగా కాదు. బయటి నిర్మాతకు చేశారు. స్క్రిప్ట్ కోసం పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగారు. మామ కెవి మహదేవన్ స్వరాలు కూర్చే బాధ్యతను తీసుకున్నారు. అప్పుడు దివ్యభారతికి మంచి డిమాండ్ ఉంది. మొదటి మూడు సినిమాలు బొబ్బలిరాజా-అసెంబ్లీ రౌడీ-రౌడీ అల్లుడు బ్లాక్ బస్టర్స్.

ఆ తర్వాత నా ఇల్లే నా స్వర్గం-ధర్మక్షేత్రం రెండూ డిజాస్టర్ అయ్యాయి. చిట్టెమ్మ మొగుడు హ్యాట్రిక్ కొడుతుందేమోననే కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి వేగంగానే షూటింగ్ పూర్తి చేసుకుంది. మానసికంగా పరిపక్వత లేని చిట్టెమ్మ పిల్లలు పుడితే తాను చనిపోతాననే లేనిపోని భయాలతో ప్రేమించిన బావని పెళ్లి చేసుకున్నాక కూడా దూరం పెడుతుంది. దాంతో భర్త ఓ లేడీ డాక్టర్ మోజులో పడతాడు. అదయ్యాక చిట్టెమ్మని రేప్ చేస్తాడు. ఫలితంగా తను గర్భవతి అవుతుంది. భార్యనే మానభంగం చేసే విచిత్రమైన ట్విస్టుని మన ప్రేక్షకులు జీరించుకోలేకపోయారు. ఫలితంగా 1993 ఫిబ్రవరి 11 విడుదలైన చిట్టెమ్మ మొగుడు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. కాకపోతే దివ్యభారతికి నంది అవార్డు వచ్చింది. తర్వాత ఆమె చేసిన ఆఖరి తెలుగు సినిమా తొలిముద్దు

Also Read : Hema Hemmeelu : ఏఎన్ఆర్ కృష్ణ కాంబోలో భారీ సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి