iDreamPost

టంగు స్లిప్పు – ఆపై సారీ చెప్పు

టంగు స్లిప్పు  – ఆపై సారీ చెప్పు

సినిమా తారలు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు దేనిగురించైనా సరే ఆచితూచి మాట్లాడాలి. అందులోనూ సోషల్ మీడియాలో ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతున్నప్పుడు మరింత అప్రమత్తత అవసరం. కానీ విచక్షణ మరిచి ఏదో సరదాగా ట్వీట్ వేశామనుకునే సెలబ్రిటీలు ఎవరైనా సరే దానికి తగ్గ మూల్యం చెల్లించాల్సిందే. చిన్న సంఘటనే అయినా మాజీ హీరోయిన్ కం ఇప్పటి నిర్మాత ఛార్మీకి ఇది అనుభవంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రవేశించిన కరోనా వైరస్ గురించి జనంలో ఎంతటి భయాందోళలు ఉన్నాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లో కరోనా లక్షణాలు కనిపించడం ఇప్పుడు నగరం మొత్తాన్ని వణికిస్తోంది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుని ఇది వ్యాప్తం కాకుండా కట్టడి చేస్తున్నప్పటికీ దీన్నీ సరదా వ్యవహారంగా తీసుకుని కొందరు నెటిజెన్లు జోకులు వేయడం అప్పుడే మొదలైంది. ముక్కు మొహం తెలియని వాళ్ళు చేస్తే ఏదో అనుకోవచ్చు కానీ లక్షలాది ఫాలోయర్స్ ఉన్న ఛార్మీ కూడా దీనికి పాల్పడటం ఏమనాలి

నిన్నో వీడియో పోస్ట్ చేస్తూ కరోనా హైదరాబాద్ వచ్చిందటగా దానికి వెల్కమ్ అంటూ వ్యంగ్యంగా అందులో పేర్కొనడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బాధ్యత కలిగిన సెలబ్రిటీ వ్యవహరించాల్సిన సెలబ్రిటీ చాలా ప్రమాదరకమైన వైరస్ జబ్బు గురించి ఇంత చులకనగా మాట్లాడ్డం ఏమిటని కామెంట్స్ లో జనం విరుచుకుపడ్డారు. కొందరు తీవ్రంగా రెస్పాండ్ కాగా కొందరు దీన్నీ తమాషాగా తీసుకుని సమర్దించిన వాళ్ళు లేకపోలేదు. ఎక్కడో ముంబై లైగర్ షూటింగ్ లో ఉంటూ సరదాగా చేసిన ఈ పని ఎంత తప్పో ఛార్మీకి తెలిసొచ్చింది.

వెంటనే క్షమాపణ చెబుతూ ఆ వీడియోని డిలీట్ చేసి అపరిపక్వతతో ఇదంతా చేశానని ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని మెసేజ్ పెట్టింది. ప్రాణాలు తీసే వ్యాధి గురించి కామెంట్లు చేసినందుకు చార్మీ ఫైనల్ గా సారీ చెప్పేదాకా వచ్చింది పరిస్థితి. పెద్దలు చెప్పినట్టు అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అనే సామెత ఇప్పుడు గుర్తొస్తోంది కదూ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి