iDreamPost

చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాపై పోలీసులకు ఫిర్యాదు!

  • Author singhj Published - 05:08 PM, Fri - 15 September 23
  • Author singhj Published - 05:08 PM, Fri - 15 September 23
చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాపై పోలీసులకు ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్కిల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన విషయం విదితమే. టీడీపీ అధినేత అరెస్ట్ అంశం​ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన బాబు అరెస్ట్​తో ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్​లో ఆయనకు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్​ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో గతంలో ఆయనపై నమోదైన కేసులు మరోమారు తెర మీదకు వస్తున్నాయి.

స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్​లో చంద్రబాబు తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ సిద్ధార్థ్​ లూథ్రా పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. బాబు కేసును వాదిస్తున్న లూథ్రాపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రజల్ని ఆయుధాలు పట్టి ఉద్యమించాలంటూ సిద్ధార్థ్​ లూథ్రా ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ పోలీసులను వైసీపీ నాయకులు ఆశ్రయించారు. తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలసి నాయకులు స్థానిక పోలీసు స్టేషన్​లో కంప్లయింట్ ఇచ్చారు.

చంద్రబాబు తరఫున వాదిస్తున్న లూథ్రా ఆశించిన తీర్పు రాలేదు. బాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురవ్వడంతో ఇక యుద్ధం చేయాల్సిందేనంటూ సిక్కుల మత గురువు గోబింద్ సింగ్ చెప్పిన ఒక సూక్తిని ఉదహరించారు లూథ్రా. ‘కనుచూపు మేరలో న్యాయం లేదని తెలిసినప్పుడు.. కత్తి తీసి యుద్ధం చేయడమే సరైంది’ అంటూ లూథ్రా ట్వీట్ చేశారు. ఆయుధాలతోనే పని జరుగుతుందనే అర్థం వచ్చేలా లూథ్రా వ్యాఖ్య చేశారని ఫిర్యాదులో వైసీపీ నేతలు పేర్కొన్నారు. హింస వైపుగా ప్రజల్ని ప్రేరేపించడం నేరమని.. దీని మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను వాళ్లు కోరారు. అయితే ఈ ఫిర్యాదు విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇదీ చదవండి: తోడేళ్ల ముఠాకు, సింహానికి మధ్య పోరాటం: విజయసాయి రెడ్డి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి