iDreamPost

పరామర్శకు వచ్చారా.. ప్రచారానికా?

పరామర్శకు వచ్చారా.. ప్రచారానికా?

ప్రతి అంశంలోనూ ప్రచారం కోరుకొనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చివరకు చావులను కూడా విడిచిపెట్టడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల వరుసగా సంభవించిన మరణాలకు కారణం కల్తీ సారాయే కారణమంటూ ఆరోపించిన చంద్రబాబు దానికి తన మీడియాలో విస్తృతంగా ప్రచారం ఇస్తున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి సోమవారం ఆయన జంగారెడ్డిగూడెం వెళ్లారు. ఇక్కడ కూడా విపరీతమైన ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ అంశంపై ఈరోజు అసెంబ్లీలో చర్చించి తీరాలని తమ సభ్యులతో సభలో రభస చేయింంచారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై టీడీపీ సభ్యులు కాగితాలు చింపి విసరడమే కాక సభా కార్యక్రమాలు సాగకుండా అడ్డుకున్నారు. అధికార పక్షాన్ని, స్పీకర్‌ సహనాన్ని పరీక్షించేలా ప్రవర్తించి చివరకు ఐదుగురు సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు సభలో హంగామా చేసి తమ చానెళ్ల సాక్షిగా ప్రచారం పొందారు.

ఇదిలా సాగుతుండగానే తాను మృతుల కుటుంబాలను పరామర్శించడానికి జంగారెడ్డిగూడెం వెళుతున్నానహో.. అంటూ పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. అమరావతిలో విలేకరుల ఎదుట ఆవేశపడిపోయారు. మృతుల కుటుంబీకులతో మాట్లాడకుండానే కల్తీసారా తాగడం వలనే మరణాలు సంభవించాయని నిర్దారించేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేసేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ ఆరోపించారు.

అక్కడా అందే తంతు..

ఆ తర్వాత జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబీకుల పరామర్శ సందర్భంగానూ ఇదే విధంగా వ్యవహరించారు. రాజు వెడలె రవితేజములలరగా అన్నట్టు ఆయన పరామర్శ పర్యటన సాగింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. నాటుసారా మృతుల కేసులన్నీ సహజ మరణాలని అంటున్న జగన్ కు పరిపాలించే అర్హత ఉందా? అని ఆయన ప్రశ్నించడమే కాక ఆయన పరిపాలించే అర్హత కోల్పోయాడని తనదైన శైలిలో విమర్శలు లంఘించుకున్నారు. ఎల్జీ పాలిమర్స్  మృతుల  కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చారు. నాటుసారా బాధితులకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల  చొప్పున పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని, నాటుసారా బాధితులకు ప్రభుత్వ సౌకర్యాలను కట్ చేస్తే తాము వచ్చాక పునరుద్దరిస్తామని రాజకీయ హామీలు కూడా ఇచ్చేశారు.

ప్రభుత్వం చెబుతున్నా వినకుండా ఆరోపణలు

నాటుసారా తాగడం వల్లనే ఐదుగురు చనిపోయారని.. మిగతా వారు వివిధ వ్యాధులతో మరణించారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అసెంబ్లీలో ప్రకటించారు. అక్కడి సాధారణ మరణాలను టీడీపీ కల్తీ మద్యం మరణాలుగా చిత్రీకరిస్తోందని చెప్పారు. అయినా వినకుండా ఈ అంశంలో ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాబు తన పబ్లిసిటీ స్టంట్‌ను కొనసాగించారు. అటు అసెంబ్లీలో టీడీపీ సభ్యులతో హడావుడి చేయించారు. ఇటు బయట సొంత మీడియా సాయంతో తానే స్వయంగా హంగామా చేశారు. జంగారెడ్డిగూడెంలో బాధితులను పరామర్శించడం కన్నా దీని నుంచి పార్టీకి రాజకీయంగా మైలేజీ కల్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి