iDreamPost

రైతు భరోసాలో డబ్బులందుతున్నట్లు అంగీకరించిన చంద్రబాబు

రైతు భరోసాలో డబ్బులందుతున్నట్లు అంగీకరించిన చంద్రబాబు

రైతులను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా పథకంలో రైతులకు డబ్బులు అందుతున్నట్లు మొత్తానికి చంద్రబాబునాయుడు అంగీకరించాడు. ఒకవైపు జగన్ రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు అంగీకరిస్తునే అదే సమయంలో తన హయాంలో రైతులకు డబ్బులు అందలేదని కూడా అంగీకరించాడు. పార్టీ మండల స్ధాయి నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో రైతులకు ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 37500 ఇస్తున్నట్లు అంగీకరించాడు.

ఇదే సమయంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ప్రతిరైతుకు అన్నదాత-సుఖీభవ పథకం ద్వారా రూ. 75 వేలు అందేదట. అలాగే చేయలేకపోయిన 4, 5 రుణమాఫీ కిస్తీలను కూడా కలుపుకుంటే ప్రతి రైతుకు ఏడాదికి రూ. 1.15 లక్షలు అంది ఉండేదంటూ తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారు. రైతు భరోసాలో రైతులకు 37500 రూపాయలు వస్తోందన్నదే నిజం. టిడిపి అధికారంలోకి వచ్చుంటే అని చెప్పిందంతా ఉత్త సొల్లే అని అర్ధమైపోతోంది.

2014లో అధికారంలోకి రావటానికి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ కూడా చాలా కీలకం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్దిదారులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే. పైగా తాను చేయాల్సిన రుణమాఫీని చేయకుండా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేయాలంటూ డిమాండ్ చేసిన విచిత్రమైన వ్యక్తి చంద్రబాబు. పైగా అధికారంలో ఉన్నపుడు రుణమాఫీ చేయకుండా ఇపుడు అధికారంలో ఉండుంటే చేసేవాడినే అంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది.

పైగా జగన్ వల్ల ప్రతిరైతు రూ. 78 వేలు నష్టపోతున్నట్లు పనికిమాలిన లాజిక్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సరే తాము అధికారంలోకి వస్తే మళ్ళీ రైతులకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం మామూలే. అధికారంలో ఉన్నపుడు తానిచ్చిన హామీలను అమలు చేయటంలో జనాలను మోసం చేసిన చంద్రబాబు ఇపుడు అధికారంలో ఉండుంటే లేకపోతే అధికారంలోకి వస్తే అంటూ మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తం మీద రైతుభరోసా పథకంలో ప్రతి రైతుకు ఏడాదికి రూ. 37500 అందుతోందని ఒప్పుకోవటమే గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి