iDreamPost

ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీవీకి కేంద్రం షాక్

ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీవీకి కేంద్రం షాక్

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతోనూ, అప్పటి సీఎం చంద్రబాబుతోనూ అంటకాగి అనేక అక్రమాలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రంలోనూ చుక్కెదురైంది. తనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. అయితే కేంద్రం అతని అప్పీలును తిరస్కరించి సస్పెన్షన్ ను ఖరారు చేసింది. అంతే కాకుండా అతనిపై చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. చంద్రబాబు హయాంలో ఇజ్రాయెల్ నుంచి రూ.25.5 కోట్లతో నిఘా పరికరాలు కోనుగోలు వ్యవహారంలో అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిర్ధారణ కావడంతో తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది.

ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగుకు కుట్ర

రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీవీ కుట్రపన్నారు. అందుకోసం ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేయాలని 2017లో నిర్ణయించారు. క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్సు పరికరాలను ఇజ్రాయెల్ కు చెందిన ఆర్టీ ఇన్ఫ్లెటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. నిఘా, రక్షణ పరికరాలు కొనుగోలు చేయాలంటే ముందు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ అనుమతి తీసుకోకుండానే ఇజ్రాయెల్ సంస్థతో ఒప్పందం కుదిర్చేసుకున్నారు. తద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ ను లీక్ చేశారని కూడా కేంద్ర హోమ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

కుమారుడి షెల్ సంస్థకు కాంట్రాక్ట్

నిఘా పరికరాల కొనుగోలులో రక్షణ శాఖ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఏబీవీ తన కుమారుడితో ఓ డొల్ల (షెల్) కంపెనీని ఏర్పాటు చేయించి నిఘా పరికరాలు కొనుగోలు కాంట్రాక్టును ఆ సంస్థకు కట్టబెట్టారు. విజయవాడ క్రీస్తురాజపురం ప్రాంతంలో ఓ ఫ్లాట్ చిరునామాతో ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏ డొల్ల కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి ఏబీవీ కుమారుడు చేతన్ సాయి కృష్ణ సీఈవోగా పేర్కొన్నారు. దీన్ని ఇజ్రాయెల్ కంపెనీకి భారత ఫ్రాంచైజీగా చూపించి నిఘా పరికరాలు కొనుగోలు కాంట్రాక్టు కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏబీవీ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. తాజాగా కేంద్ర హోంశాఖ దాన్ని ధృవీకరించడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి