iDreamPost

ముందస్తు బెయిల్ ఇవ్వండి : కోర్టుకెక్కిన ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్‌

ముందస్తు బెయిల్ ఇవ్వండి : కోర్టుకెక్కిన ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్‌

చంద్రబాబు హయంలో చక్రం తిప్పిన ఇంటిలిజెన్స్ విభాగం మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావుకి అరెస్ట్ బెంగ పట్టుకుంది. ఇప్పటికే ఆయన సస్ఫెన్షన్ వ్యవహారంలో తన పిటీషన్ కి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయన ఖంగుతిన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఏబీవీ మీద తీసుకున్న చర్యలను నిలుపుదల చేసే ప్రయత్నానికి అంగీకరించలేదు. దాంతో ఇప్పుడు తనను సెలవు రోజుల్లో అరెస్ట్ చేసి, జైలుకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళనతో ఉన్నారు.

గత ప్రభుత్వంలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని శాసించిన ఏబీవీపై చర్యలకు ఇప్పుడు పోలీస్ వర్గాలు సన్నద్దమవుతున్నాయని సందేహిస్తూ ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. దానికి తగ్గట్టుగా ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. తనను అరెస్ట్ చేసి 48 గంటల పాటు కస్టడీలో ఉంచే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. అదే జరిగితే తనను మరోసారి సస్ఫెన్షన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టేనని ఆయన భావిస్తున్నారు. ఏబీవీ పిటీషన్ పై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తోంది.

గతంలో ఏపీ పోలీస్ విభాగానికి అవసరమైన వివిధ నిఘా సామాగ్రి కొనుగోళ్ల వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు పాత్రపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన కొడుకు పేరుతో ఇజ్రాయేల్ నుంచి కొనుగోలు చేసిన యంత్రాల నాణ్యత, చెల్లించిన నగదులో పారదర్శకత లేకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అదే కేసులో విచారణ నిమిత్తం ఏబీవీని అరెస్ట్ చేస్తారనే భయాందోళనలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీ పోలీసుల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రయత్నాలు ప్రారంభంకాకపోయినా ముందస్తు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఈ వ్యవహారాలు ఏపీ పోలీస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్ముకున్న చందంగా మారిన ఏబీవీ పరిస్థితిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి