iDreamPost

కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళలకు నెలకు రూ.10 వేల ఆదాయం

  • Published Mar 04, 2024 | 3:56 PMUpdated Mar 04, 2024 | 3:56 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ పథకం ద్వారా మహిళలు నెలకు 10 వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ పథకం ద్వారా మహిళలు నెలకు 10 వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

  • Published Mar 04, 2024 | 3:56 PMUpdated Mar 04, 2024 | 3:56 PM
కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళలకు నెలకు రూ.10 వేల ఆదాయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారిత, ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం అనేక కార్యక్రమాలు, స్కీములు తీసుకొస్తున్నాయి. అయితే చాలా పథకాల గురించి జనాలకు పెద్దగా తెలియదు. దాంతో ఎన్నో పథకాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావడం లేదు.. ప్రభుత్వాలు కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. అలాంటి ఓ పథకం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా.. మహిళలు నెలకు 10 వేలలోపున.. ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. మరి ఇంతకు ఈ పథకం ఏంటి.. దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలి అంటే..

మహిళలు ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అదే డ్రోన్‌ దీదీ యోజన. ఇటీవలే కేంద్ర కేబినెట్‌ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాల్లో ఉన్న సుమారు 15 వేల మంది మహిళలకు కేంద్రం డ్రోన్లను ఇస్తుంది. అందువల్ల ఈ పథకాన్ని వుమెన్‌ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ డ్రోన్‌ స్కీమ్‌ అని కూడా పిలుస్తున్నారు.

దీని ద్వారా కేంద్రం ఇచ్చే డ్రోన్లతో మహిళా రైతులు.. పొలాల్లో ఎరువుల్ని పిచికారీ చెయ్యవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకూ కేంద్రం వీరికి డ్రోన్లను ఇస్తుంది. డ్రోన్‌ ద్వారా ఎరువుల్ని ఎలా పిచికారీ చేయ్యాలో ట్రైనింగ్‌ ఇస్తుంది. తద్వారా వారు నెలకు 10 వేల రూపాయల చొప్పున ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఇక డ్రోన్‌ ద్వారా పిచికారీ ఎలా చేయాలో శిక్షణ పొందిన సదరు మహిళ.. ఆ స్వయం సహాయక బృందంలోని వారి పొలాలతోపాటూ.. ఇతర పొలాలకు కూడా ఎరువులు పిచికారీ చెయ్యవచ్చు. ఈ పథకం కింద, డ్రోన్ కొనుగోలు కోసం, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ ఖర్చులో 80 శాతం, అలాగే ఉపకరణాలు/యాక్సెసరీస్ ఛార్జీలు లేదా గరిష్టంగా రూ.8 లక్షల వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది.

మిగిలిన మొత్తం అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద రుణంగా మంజూరు చేస్తారు. ఈ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తుంది. ఇక త్వరలోనే కేంద్రం ఈ పథకానికి సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. అది వినియోగంలోకి వచ్చాక.. డ్రోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కేంద్రం డ్రోన్ ఇచ్చి, డ్రోన్ వాడే మహిళా రైతుకు ట్రైనింగ్ ఇస్తుంది.

దేశంలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో ఉన్నారు. వారిలో 15,000 మంది కేంద్ర ప్రభుత్వం అందించే డ్రోన్‌లను పొందగలరు. డ్రోన్ పొందిన మహిళకు 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో 5 రోజులు డ్రోన్ ఎలా వాడాలో చెబుతారు. మరో 10 రోజులు డ్రోన్‌తో పిచికారీ ఎలా చెయ్యాలో చెబుతారు. ఇలా శిక్షణ పొందిన మహిళలు డ్రోన్‌ల ద్వారా ఎరువులు పిచికారీ చేస్తూ.. ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం వరకు పొందవచ్చు. ఇలా ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో ఓ విప్లవాన్ని తేనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి