iDreamPost

కేంద్రంతో పోల్చుకుంటే మాదొక అప్పా..?

కేంద్రంతో పోల్చుకుంటే మాదొక అప్పా..?

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అప్పులు చేస్తోందంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో ముకుతాడు వేస్తున్నారు. ముఖ్యంగా సర్కార్‌పై దుకూడుగా వ్యవహరిస్తున్న కమలం పార్టీ నేతలు నోళ్లు మెదపకుండా ఉండేలా సమాధానం ఇస్తున్నారు. గులాబీ సర్కార్‌ అప్పులు చేస్తోందనే విమర్శలకు.. ఒకే ఒక్క మాటతో కేసీఆర్‌ జవాబు చెప్పారు. తాము చేసేది అప్పులు కాదని, నిధుల సమీకరణ అంటూ చెప్పిన సీఎం కేసీఆర్‌.. అప్పులు చేస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అని ఫైర్‌ అయ్యారు. కేంద్రం అప్పుల లెక్కను చూపి.. తాము చేస్తుంది ఒక అప్పేనా..? అన్న భావనకు వచ్చేలా చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ అప్పులు 1.52 లక్షల కోట్ల రూపాయలని కేసీఆర్‌ చెప్పారు. పక్కా సమాచారంతోనే కేసీఆర్‌ ఈ వివరాలను వెల్లడించారని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. కేవలం 8 ఏళ్ల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌ రెట్టింపు అప్పులు చేసింది. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చే 2014 నాటికి కేంద్రం అప్పులు 62 లక్షల కోట్ల రూపాయలు ఉండగా.. ఈ ఎనిమిదేళ్లలో ఆ మొత్తం అప్పు 152 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఈ లెక్కలు చెబుతున్న కేసీఆర్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్లల మాదిరిగా కేంద్రాన్ని ఇరుకున పెడుతూ.. అదే సమయంలో తాము చేసే అప్పు అసలు అప్పే కాదనేలా వివరిస్తున్నారు.

కేంద్రం 58.5 శాతం అప్పులు చేస్తోందని, రాష్ట్రాలను మాత్రం 25 శాతం లోపే అప్పులు చేయాలని చెబుతూ తొక్కిపెడుతోందని కేసీఆర్‌ ఆరోపిస్తున్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఏడాది జనవరిలో జీఎస్టీ వసూళ్లు 1.41 లక్షల కోట్ల రూపాయలు కావడం విశేషం. అంటే జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. జీఎస్టీకి తోడు పెట్రోల్, డీజీల్‌పై ఎక్సైజ్‌ సుంకాల రూపంలో మరో నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈ స్థాయిలో ఆదాయం వస్తున్నా.. భారీ మొత్తంలో అప్పులు చేస్తున్నా.. తెలంగాణ కన్నా కేంద్రం పనితీరు తక్కువగా ఉందంటూ కేసీఆర్‌ మోడీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి