iDreamPost

ఏపీలో మోగిన ఎమ్మెల్సీ నగారా

ఏపీలో మోగిన ఎమ్మెల్సీ నగారా

తిరుపతి ఉప ఎన్నికకు ముందే ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన శాసన మండలి సభ్యత్వానికి ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కాబోతోంది. ఈ నెలాఖరు నాటికి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసేలా నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.

ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్‌ జారీ కానుంది. 18వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ మరుసటిరోజే నామినేషన్లు పరిశీలన జరగనుంది. 21వ తేదీ వరకూ నామినేషన్లు విత్‌డ్రాకు అవకాశం ఇచ్చారు. 28వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానుంది.

టీడీపీ తరఫున శాసనసభ్యుల కోటాలో 2015లో పోతుల సునీత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన సునీత ఆమంచి కృష్ణమోషన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమంచి కూడా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో చీరాల టిక్కెట్‌ను సునీత ఆశించగా… అది కాస్త సీనియర్‌ నేత కరణం బలరాంకు దక్కింది. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న పోతుల సునీత.. గత ఏడాది జనవరిలో మూడు రాజధానుల బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి టీడీపీ విప్‌ను ధిక్కరించారు. అప్పటి నుంచి ఆమె టీడీపీకి దూరంగా ఉంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. గత అక్టోబర్‌లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి