iDreamPost

బాబు మీ ఆత్మ ఏమైంది?పోతిరెడ్డిపాడు మీద ఎందుకు సూటిగా మాట్లాడటం లేదు?

బాబు మీ ఆత్మ ఏమైంది?పోతిరెడ్డిపాడు మీద ఎందుకు సూటిగా మాట్లాడటం లేదు?

వయసు పెరిగే కొద్దీ,అనుభవం పెరిగికొద్దీ వ్యక్తిత్వం ఒక రూపం తీసుకోవాలి ,అభిప్రాయలు బలపడాలి, పరిస్థితులకు లొంగకుండా స్థిర చిత్తంతో స్పందించేలా రాటుదేలాలి… ఇదే వ్యక్తిత్వ వికాసం ,పరిణితి సాధించటం.. స్థిర చిత్తం పొందటం…

40 యేళ్ళ అనుభవం తరువాత కూడా ఏ విషయం మీద సూటిగా స్పందించలేకపోవటం.. హౌ మెనీ చిల్డ్రెన్ యూ హావ్ అని అడగటం.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి అనవసర అంశాలను హైలెట్ చేయటం చంద్రబాబు విషయంలో చాలాసార్లు ప్రజలు చూసారు.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కరోనా ప్రభావ నివారణలో అటు తెలంగాణా,ఇటు ఆంధ్రా ముందు వరుసలో ఉన్నాయి..కరోనా మరణాలు కూడా చాలా అదుపులో ఉన్నాయి.. కానీ చంద్రబాబుకు మాత్రం ఉభయ రాష్ట్రాలలో కరోనా విలయ తాండవం చేస్తుందని, దాని మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికే పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచుతూ ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసాడని, ఇది కెసిఆర్ – జగన్ కుమ్మక్కు రాజకీయం అని.. ఆరోపణ చేసాడు…

నేనే సీనియర్ అంటూ అడిగినోడికి అడగనోడికి కూడా చెప్పుకుంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు సమస్యల మీద స్పందించటంలో మాత్రం ఆ సీనియార్టినీ ,పరిణితిని చూపాలన్న విచక్షణ కనిపించటం లేదు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు మీద స్పందించకుండా, కరోనా నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికే పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచుతూ జీవో విడుదల చేశారు అనటం చంద్రబాబు విశ్వసనీయతను ప్రశ్నించేలా చేస్తుంది.

Also Read:పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే నిజంగా నష్టం జరుగుతుందా?

ఏ రాజకీయ నాయకుడైన సమస్య మీద స్పందించాలి,ఆ సబ్జెక్టుకు అనుకూలం అయితే ఎన్ని ఇబ్బందులు వొచ్చినా,ఒత్తిడులు వొచ్చిన త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ కూడా చేయాలి. అలాకాకుండా ఆ సబ్జెక్టుకు వ్యతిరేకం అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వివరముగా చెప్పాలి, ఏమైనా సవరణలు ఉంటే సూచించాలి.. అంతేకాని అసలు విషయాన్ని వొదిలి డొంకతిరుగుడుగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది..

చంద్రబాబుకు అధికారంలోకి ఎవరు వొచ్చినా తనలాగే దాటవేసే పద్దతిని పాటిస్తారన్న భ్రమ ఉన్నట్లుంది. ఆయన హయాంలో వేసిన శంకుస్థాపనలు అన్ని ఎన్నికల శంకుస్థాపనలే.. పట్టిసీమ దీనికి మినహాయింపు. ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టకుండా కేవలం ప్రచారంతో ఐదేళ్ల పుణ్యకాలం గడిపేశాడు.

జగన్ అధికారంలోకి వొచ్చిన తరువాత ఆరు నెలలలోనే తన ప్రణాళికను ప్రకటించాడు.. తొమ్మి నెలల నుంచి – సంవత్సరంలోపు జీవోలు విడుదల చేయటం,శంకుస్థాపనలు చేయటం చకచకా చేసుకొని వెళుతున్నాడు..పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచటం చంద్రబాబుకు డైవర్షన్ అనిపించవచ్చు కానీ జగన్ ఈ పథకాన్ని అంటే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచటం,కాలువలు వెడల్పు చేసి సామర్ధ్యాన్ని పెంచటం మీద 20-Nov-2019 నాడే బహిరంగంగా ప్రకటించాడు.. ఆ వార్త తరువాత రోజు అన్ని పత్రికల్లో వొచ్చాయి.. చంద్రబాబులాగా మాటలకు పరిమితం కావటం లేదు కాబట్టే కరోనా హడావుడి కొంచం తగ్గిన తరువాత టెండర్ లు పిలుస్తూ జీవో ఇచ్చారు.. మరి దీనిలో చంద్రబాబుకు కనిపించిన దృష్టి మరల్చే రాజకీయం ఏమిటో అర్ధం కాదు. .. అసలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబే అని అందరికి అర్ధం అవుతుంది… లేక తనలాగా మాటలుకు మాత్రమే పరిమితం కాకుండా పనులు మొదలుపెడుతుండటం చూసి చంద్రబాబుకు బాధగా ఉందో అర్ధం కాదు.

2019 డిసెంబర్ నెలలో
1) కుందు నది మీద 0.8 టీఎంసీల జోలదరాశి ప్రాజెక్ట్  శంకుస్థాపన
2) కుందు నది మీద 2.95 టీఎంసీల రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన
3) కుందూ నది నుంచి దువ్వూరు చెరువు ద్వారా బ్రహ్మం సాగర్ కు లిఫ్ట్ స్కీం పథకాలకు శంకుస్థాపన 
4) గాలేరు-నగరి పథకంలో భాగంగా ఆరేటిపల్లి వద్ద 20 టీఎంసీల సామర్ధ్యంతో ఒక కొత్త ప్రాజెక్ట్ నిర్మిస్తామని ప్రకటించాడు.

Also Read:నీటి కలల సాకారం దిశగా- మూడు శంకుస్థాపనలు

ఈ పనులు చూసిన ఎవరికైనా నీటి పారుదల విషయంలో జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడనిపిస్తుంది . ఈ ప్రాజెక్టులు ప్రకటించిన నాడు కూడా “నేనూ సీమబిడ్డనే” నాకు ఓట్లేయరా అని అర్ధించిన చంద్రబాబు కానీ , టీడీపీ నేతలు కానీ ప్రభుత్వాన్ని అభినందించిన పాపాన పోలేదు..దృష్టి మళ్లించటానికే జగన్ శంకుస్థాపన చేసాడు అనటానికి ఆరోజు వారికి కరోనానో మరొక పెద్ద సమస్యో లేకుండా పోయింది.

చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతానికి కాలం చెల్లింది.. ఆ సిద్ధాంతానికి ఏరోజూ ఆదరణ దక్కలేదు. ఆ సిద్ధాంతాన్ని GHMC ఎన్నికలు వెక్కిరించాయి. రెండు కళ్ళు,మూడు చెవులు అనే సిద్ధాంతాలు చరిత్రలో విజయం సాధించిందే లేదు … కానీ టీడీపీ ఇప్పటికీ అదే సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతుంది..

తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు రమణ పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని వ్యతిరేకిస్తాం అని బహిరంగ ప్రకటన చేసాడు . ఆంధ్ర టీడీపీ అధ్యక్ష్యుడు కళా వెంకట్ రావుకు స్పందించే తీరిక లేదో స్పందించొద్దని జాతీయ కార్యదర్శి లోకేష్ ఆదేశించాడో కానీ ఆయన మాట్లాడింది ఎక్కడా కనపడలేదు. ఇంకా ,ఐదేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా అదే పాత పల్లవి.. మేమే కట్టాం ..అన్ని ప్రాజెక్టులు మేమే కట్టాం అంటూ పాడిందే పాట.. అధికారంలో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకొని మేము సీమకు నీళ్లు ఇచ్చాము.. పులివెందులకు ఇచ్చాము .. ఈసారి పులివెందులలో కూడా గెలుస్తాం అంటూ మాట్లాడిన దేవినేని ఉమా పోతిరెడ్డిపాడు మీద మాత్రం స్పష్టంగా అభిప్రాయాన్ని చెప్పడు.. బహుశా వైయెస్ఆర్ హయాంలో జీవో 69 ను సవరిస్తూ తీసుకొచ్చిన జీవో170 కు వ్యతిరేకంగా ప్రకాశం బ్యారేజి కింద మూడురోజులు ధర్నా చేసిన నాటి మనస్తత్వం మళ్ళీ బయటకొస్తుందేమో.

Also Read:ఆశలు రేపుతున్న జగన్-నీటి ప్రాజెక్టులు

చంద్రబాబు తన ఆరోపణలలో పాలమూరు-రంగారెడ్డి, దిండి విషయాల మీద జగన్ విఫలమయ్యాడని, ముందు వాటిని ఆపించాలని అన్నాడు… ఈ రెండు పథకాలు మొదలైనప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు.. కృష్ణా బోర్డుకు ఒక ఫిర్యాదు చేయటం తప్ప పనులు జరగకుండా అడ్డుకోలేక పోయింది చంద్రబాబు .. టీడీపీ తరుపున అధికారికంగా ఖండించలేక పోయింది చంద్రబాబు… నిర్మాణ దశలోనే వీటిని అడ్డుకోలేపోయిన చంద్రబాబు, వాడుకలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ఇప్పుడు ఎలా అడ్డుకోవాలో చంద్రబాబు చెప్పాలి.. నాడు అధికారంలో ఉండగా ఆ పద్ధతుల్లో ఎందుకు నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయారు కూడా వివరించాలి.. కేంద్రంలో చక్రం తిప్పాను అని చెప్పుకున్న రోజుల్లోనే ఆల్మట్టి ఎత్తు పెంపును ఎందుకు అడ్డుకోలేకపోయాడు వివరముగా పుస్తకం రాస్తే భవిష్యత్తు తరాలకు నీటి ప్రాజెక్టుల విధి విధానాల మీద మంచి రిఫరెన్స్ బుక్ అవుతుంది…

చంద్రబాబు కానీ ఇతర విపక్షాలు కానీ పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు సరైన నిర్ణయం అనుకుంటే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.. లేదు ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు అనుకుంటే ఆ విషయాన్నే బహిరంగంగా చెప్పండి.. ఇందులో మూడు మార్గమే లేదు ! డైవర్షన్ రాజకీయాలతో ప్రజలను కన్ఫ్యూషన్ చెయ్యొద్దు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి