iDreamPost

రఘురామకృష్ణం రాజుపై రెండోసారి సీబీ’ఐ’

రఘురామకృష్ణం రాజుపై రెండోసారి సీబీ’ఐ’

ఎంపీ రఘురామ కృష్ణ రాజు నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం హైదరాబాద్, నరసాపురంలలోని ఎంపీ ఇళ్లపై ఈ రోజు ఉదయం దాడులు చేసింది. ఢిల్లీలోని ఎంపీ గెస్ట్‌హౌస్‌లో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాలు కొద్దిసేపటి క్రితం వెలుగులోకి వచ్చాయి.

బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారనే ఫిర్యాదుపై సీబీఐ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై గతంలోనే రెండు కేసులు నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి కొన్ని నెలల క్రితం సీబీఐ ఎంపీ నివాసం, కార్యాలయాలలో సోదాలు చేసింది. తాజాగా ఈ రోజు మరోసారి సీబీఐ అధికారులు సోదాలు చేస్తుండడం గమనార్హం.

ఎంపీకి చెందిన ఇండ్‌ భారత్‌ కంపెనీతో సహా ఆయన పేరుపై ఉన్న మరో ఎనిమిది కంపెనీలలోనూ, ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలోనూ సీబీఐ ఏకకాలంలో సోదాలు చేస్తోంది. మొదటిసారి సీబీఐ దాడులు చేసినప్పుడు.. తాను బ్యాంకులకు రుణం ఉన్న మాట వాస్తవమేనని రఘురామకృష్ణం రాజు అంగీకరించారు.

మొదటి సారి సీబీఐ సోదాలు చేసిన తర్వాత నుంచే ఆయన కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీని విమర్శిస్తూ, విధానాలను వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇటీవల ఎంపీలకు ప్రత్యేకంగా విందు కూడా ఇచ్చారు. ఇలాంటి పరిణామాల తర్వాత రఘురామకృష్ణం రాజు ఇళ్లపై మరోమారు సీబీఐ దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read Also : న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై అనుమానాలు పెంచేలా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి