iDreamPost

జగన్ కు చంద్రబాబుకు ఇదే తేడా .. సొంత పార్టీ వాళ్ళయినా కేసు తప్పదు ..

జగన్ కు చంద్రబాబుకు ఇదే తేడా .. సొంత పార్టీ వాళ్ళయినా కేసు తప్పదు ..

ఐదేళ్ళ చంద్రబాబునాయుడు పాలనకు పది మాసాల జగన్మోహన్ రెడ్డి పాలనకు తేడా స్పష్టంగా తెలిసిపోతోంది. అవినీతికి పాల్పడిందెవరైనా సరే ఉపేక్షించేది లేదనే విషయాన్ని జగన్ సర్కార్ స్పష్టంగా అందరికీ తెలియజేసింది. శాంతి భద్రతల విషయంలో తన పర బేధాలు లేకుండా పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారంటేనే జగన్ మార్కు పాలనేంటో అందరికీ అర్ధమవుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి ఎంపి డాక్టర్ సత్యవతి కుటుంబానికి చెందిన కల్యాణ మండపంలో రేషన్ షాపు బియ్యాన్ని సిపిఎం వాళ్ళు పట్టుకున్నారు. రేషన్ దుకాణాలకు వెళ్ళాల్సిన లారీ లోడు కల్యాణమండపంలో అన్ లోడ్ చేస్తున్నపుడు సిపిఎం నేతలు పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి మొత్తం బియ్యాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు కల్యాణమండపానికి తాళం వేశారు. చివరకు ఎంపి భర్త మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

దీని మీద జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి రెవిన్యు యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. రెవిన్యు చట్టాన్ని ప్రయోగించటానికి అదనంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

అసలు అధికారులు ఈ స్ధాయిలో స్పందిస్తారని కానీ యాక్షన్ తీసుకుంటారని కానీ సిపిఎం నేతలే ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ నేతల విషయాల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చంద్రబాబు హయాంలో అందరూ చూసిందే. కానీ దానికి విరుద్ధంగా బాధ్యులపై కేసులు పెట్టారంటేనే చట్టం తన పని తాను చేసుకుపోతోందనటానికి ఇదే ఉదాహరణ.

గతంలో అధికార పార్టికి చెందిన నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, తుని ఎంఎల్ఏ దాడిశెట్టి రాజ పైన కూడా పోలీసులు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయాంలో పోలీసులు ఈ విధంగా ఎప్పుడైనా వ్యవహరించారా ? ఎంఆర్వో వనజాక్షిని అందరిముందు జుట్టుపట్టుకుని అప్పటి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఈడ్చి కొడితే దిక్కేలేదు. రవాణా శాఖ కార్యదర్శి, ఐపిఎస్ అధికారి బాలసుబ్రమణ్యంను రోడ్డుమీద టిడిపి ఎంపి కేశినేని నాని, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ దౌర్జన్యం చేస్తే కేసే లేదు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో టిడిపి నేతలు పోలీసులను, రెవిన్యు సిబ్బందిని ఉరికించి కొట్టినా పట్టించుకున్న వాడే లేడు. పైగా ఎవరైనా టిడిపి నేతలపై కేసులు పెడదామని పోలీసు స్టేషన్ కు వెళితే బాధితుడినే కొట్టేవారు. ఇటువంటి ఘటనలు చూసిన వాళ్ళకి వైసిపి ప్రభుత్వంలో అధికారపార్టీ వాళ్ళ మీద పోలీసులు కేసులు పెడుతున్నారు కాబట్టే జనాలకు జగన్-చంద్రబాబు పాలనలో తేడా తెలిసిపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి