iDreamPost

Captain Movie 35 ఏళ్ళ హాలీవుడ్ మూవీని రీమేక్ చేశారా?

Captain Movie 35 ఏళ్ళ హాలీవుడ్ మూవీని రీమేక్ చేశారా?

అల్లు అర్జున్ వరుడులో విలన్ గా నటించిన ఆర్య గుర్తున్నాడుగా. ఇతనివి నేనే అంబానీ లాంటి ఒకటి రెండు డబ్బింగ్ మూవీస్ బాగానే ఆడాయి కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఆ మధ్య వచ్చిన విశాల్ ఎనిమిలో ప్రధాన పాత్ర చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇతని కొత్త సినిమా కెప్టెన్ ఫస్ట్ లుక్ ని నిన్న అఫీషియల్ గా రిలీజ్ చేశారు. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ప్యాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇలా చూస్తే ఇందులో పెద్ద విశేషం లేదు కానీ పోస్టర్ ని నిశితంగా గమనిస్తే హాలీవుడ్ క్లాసిక్ ఒకటి గుర్తురావడమే దీనికి సంబంధించిన ట్విస్ట్

1987లో ఆర్నాల్డ్ స్వాజ్నెగ్గర్ హీరోగా ప్రిడేటర్ అనే సినిమా వచ్చింది. భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అడవిలో సాధారణ కంటికి కనిపించని ఒక రాకాసి జంతువు లాంటి మనిషి రూపం అక్కడికి వచ్చిన సైనికులను చంపుతుంటుంది. దీంతో ఆ మాన్స్ టర్ ని చంపే బాధ్యత భుజాన వేసుకున్న ఆర్నాల్డ్ స్నేహితులందరూ ప్రాణాలు కోల్పోయినా ఒక్కడే పెద్దగా సాంకేతికత వాడకుండా దాన్ని ఎలా మట్టుబెట్టాడనే పాయింట్ మీద ఇది రూపొందింది. కేవలం 15 మిలియన్ డాలర్లతో రూపొంది అప్పట్లోనే 100 మిలియన్ డాలర్లు వసూలు చేయడం పెద్ద రికార్డు. 2018లో రీమేక్ చేశారు కానీ ఆ కల్ట్ క్లాసిక్ ఛాయల్లోకి వెళ్లలేక డిజాస్టర్ అయ్యింది.

ఇప్పుడీ కెప్టెన్ అచ్చం అదే తరహాలో కనిపిస్తోంది. ప్రిడేటర్ ఇప్పటి జెనరేషన్ కు తెలిసుండకపోవచ్చు. కానీ ఆ తర్వాత దీన్ని మించిన ఎన్నో సూపర్ హీరో మూవీస్, ఫారెస్ట్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. కాబట్టి ఈ థీమ్ లో మరీ ప్రత్యేకత అనిపించే అవకాశాలు తక్కువే. మరి నిజంగా కెప్టెన్ ఆ లైన్ మీదే రూపొందిందా అంటే సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. అయినా ఇంగ్లీష్ చిత్రాలను కాపీనో స్ఫూర్తిగానో తీసుకోవడం కొత్తేమి కాదు. రాంబో ఫస్ట్ బ్లడ్ రాకపోయి ఉంటే చిరంజీవికి ఖైదీ ఉండేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి మొత్తానికి ఈ కెప్టెన్ అయినా ఆర్యకు తెలుగులో హిట్ ఇస్తుందేమో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి