iDreamPost

ఇలాంటి కథతో సినిమా ఊహించగలమా

ఇలాంటి కథతో సినిమా ఊహించగలమా

ప్రతి ఆలోచన సినిమాగా తెరకెక్కించలేం. వినడానికే ఒకరకంగా వెగటనిపించే కొన్ని పాయింట్లను అసలేమాత్రం అసభ్యత అశ్లీలత లేకుండా తీయడం ఒక ఎత్తయితే వాటిని మెప్పించేలా చూపించడం గొప్ప ఆర్టు. దానికి ఉదాహరణగా ఇటీవలే ఓటిటిలో రిలీజైన అస్సామీ నుంచి హిందీలో డబ్బింగ్ చేయబడిన ఆమీస్ గురించి చెప్పాలి. భాస్కర్ హజారికా దర్శకత్వంలో చాలా లో బడ్జెట్ లో దాదాపు అందరూ కొత్త నటీనటులతో రూపొందించిన ఈ వెరైటీ థ్రిల్లర్ 2019లో విడుదలై ట్రైబెకా ఫిలిం ఫెస్టివల్ లో అయిదు క్యాటగిరీలలో స్థానం సంపాదించుకుంది. సింగపూర్ సౌత్ ఆసియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ సంస్థ ఉత్తమ దర్శకుడి పురస్కారం అందించింది.

అసలు కథేంటో చూద్దాం. డాక్టర్ నిర్మాలి(లిమా దాస్)తన ఏడేళ్ల కొడుకుతో ఒంటరిగా క్లినిక్ నడుపుతూ ఉంటుంది. భర్త ఉద్యోగరిత్యా క్యాంపుల మీద తిరుగుతూ ఉంటాడు. ఓ సందర్భంలో ఆహార పదార్థాల మీద పిహెచ్డి చేస్తున్న యువకుడు సుమన్(అర్ఘదీప్)ఆమెకు పరిచయమవుతాడు. నిర్మాలికి నాన్ వెజ్ అంటే ఇష్టమని తెలుసుకుని రకరకాల జంతువుల మాంసాన్ని వండి తీసుకొస్తాడు. ఆవిడకవి విపరీతంగా నచ్చేస్తాయి. ఆమె మీద ప్రేమతో సుమన్ ఏకంగా తన శరీరంలోని కొంత కండ తీసుకుని వండి తినిపిస్తాడు. దానికి నిర్మాలి బానిసైపోయి తినకుండా ఉండలేని స్థితికి వస్తుంది. దీంతో అతడు మనిషి మాంసం కోసం ఏకంగా ఓ రిక్షావాడిని చంపేస్తాడు.

ఆ తర్వాత ఇద్దరూ పోలీసులకు దొరికిపోతారు. కోర్టుకు వెళ్లే ముందు శుభం కార్డు పడిపోతుంది. స్టోరీని ఇలా చదివితే కొందరికి జుగుప్సగా అనిపించవచ్చు కానీ దర్శకుడు భాస్కర్ హజారికా అసలాంటి ఫీలింగ్ రాకుండా చాలా నీట్ స్క్రీన్ ప్లేతో గంటా యాభై నిముషాల పాటు నడిపించిన తీరు ప్రశంసనీయం. హాలీవుడ్ లో హానిబాల్ లాంటి సినిమాల్లో ఇలాంటి కాన్సెప్ట్ ఉంది కానీ అవి చూస్తేనే వాంతొచ్చేలా ఉంటాయి. కానీ ఆమిస్ వేరు. మొదటి సినిమా అయినా లిమా, అర్ఘదీప్ ల సహజమైన నటన భాస్కర్ ఆలోచనలను గొప్పగా పసిగట్టింది. ఈ కారణంగానే అనురాగ్ కశ్యప్ దీనికి సహ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు. సినిమా సూత్రాలకు కట్టుబడకుండా సాహసమనిపించే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాను ఎలాంటి అనుమానాలు లేకుండా చూడండి. వ్యసనం తాలూకు పరిణామాల గురించి ఆలోచిస్తారు.

Also Read : అసోసియేషన్ ఎన్నికలు – మాటల దాడులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి