iDreamPost

కరోనాను భారత్ అడ్డుకోగలదా ?

కరోనాను భారత్ అడ్డుకోగలదా ?

చైనాను వణికిస్తున్న కరోనా మెల్లగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుంది. ఎంతో అభివృద్ధి చెందిన చైనా లాంటి దేశం ప్రస్తుతం కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతుంది. కొన్ని నగరాలకు రవాణా వ్యవస్థను కూడా స్తంభింప చేసారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు చైనా నుండి ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ వ్యాపిస్తుంది. చైనా పక్క దేశమైన భారత్ లో కూడా కరోనా వైరస్ వ్యాపించిందనే అనుమానాలతో అనేక మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ ఫేస్బుక్ లలో కరోనా వైరస్ భారత్ లో అనేకమందికి సోకిందనే పుకార్లు మొదలయ్యాయి. దాంతో ఆ మెసేజులు ఫార్వార్డ్ చేసుకుంటూ అనేకమంది కాలం గడుపుతున్నారు. ఒకవేళ అదే కరోనా వైరస్ భారత్ కు వస్తే భారత ప్రభుత్వం దాన్ని ఎదుర్కోగలదా అంటే అనుమానమే..

Read Also: వణికిస్తున్న కరోనా…

చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే కరోనాకి వణుకుతుంటే అభివృద్ధి చెందుతున్న భారత్ ఆ వైరస్ ను ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆలోచించాల్సిన విషయం.. చైనాలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దాదాపు 13 నగరాలకు ప్రజా రవాణా స్తంభింప చేసారు. కేవలం పది రోజుల్లో అత్యున్నతమైన ఆసుపత్రిని కట్టడానికి వారికున్న టెక్నాలజీని వాడుతున్నారు. వైరస్ ను అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం కృషి చేస్తుంది.. దానికితోడు వైరస్ కు మందును కనిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చైనాతో పోలిస్తే చాలా విషయాల్లో వెనుకబడిన భారత్ ఒకవేళ కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయగలదని ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్ధం అవుతాయి. గతంలో స్వైన్ ఫ్లూ వ్యాధి తెలుగు రాష్ట్రాల్లో విజృంభించినప్పుడు దాన్ని నివారించడానికి తీసుకున్న చర్యలు గుర్తు చేసుకుంటే మనకు అసలు విషయం అర్ధం అవుతుంది. ఆ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక వార్డును స్పెషల్ గా కేటాయించి స్వైన్ ఫ్లూ బాధితులకు చికిత్స చేసారు. అంతేకానీ ఏదైనా అంతు చిక్కని వైరస్ వ్యాపిస్తున్నప్పుడు అలాంటి అరుదైన వైరస్ ల ద్వారా వ్యాపించే వ్యాధులకు చికిత్స కోసం ప్రత్యేకమైన హాస్పిటల్స్ నిర్మించలేదు..

Read Also: మానవాళికి వైరస్‌ల ముప్పు

చైనా కాబట్టి ప్రజారవాణా వైరస్ కి ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి ప్రజారవాణా స్తంభింపజేసింది. మన దేశం అలాంటి నిర్ణయం తీసుకోగలదా అంటే అదీ అనుమానమే. ఒకవేళ అలా చేస్తే మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టే వారికీ కొదువ ఉండదు. అత్యంత జన సమ్మర్ధంగా ఉండే మన నగరాల్లో ఒకరినుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు మరీ ఎక్కువ.. ఒకవేళ ఏదైనా నగరంలో వైరస్ వ్యాపిస్తే మిగిలిన ప్రజలకు వ్యాపించకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోగలదా అంటే అనుమానమే.

తీసుకోవాల్సిన చర్యలు

ఈ ఆధునిక కాలంలో కొత్త కొత్త వైరస్ లు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటిని అడ్డుకోవడానికి సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ప్రతీ ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా కొత్త కొత్త వైరస్ ల కారణంగా పుట్టుకొచ్చే, కొత్త రోగాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన హాస్పిటల్స్ నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కొత్తగా పుట్టుకొచ్చే రోగాలను అరికట్టడానికి అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, దాహం వేసినప్పుడు బావి తవ్వడానికి ప్రయత్నం చేయడం రెండూ ఒకటే.. అదే ముందే బావి తవ్వుకుని ఉంటే దాహం వేసినపుడు నీళ్లు తాగే అవకాశం ఉంటుంది.

అరుదైన వ్యాధులను అరికట్టడానికి అత్యాధునిక వసతులుండి, నిపుణులైన వైద్యులతో కూడిన హాస్పిటల్స్ ని, ముందుగానే నిర్మిస్తే ఏదైనా కొత్త వ్యాధి బయట పడిన వెంటనే వ్యాధి సోకిన వారిని గుర్తించి ప్రత్యేకమైన హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం ఇంకా కొన్ని విషయాల్లో వెనుకపడి ఉందనే విషయం మన ప్రభుత్వాలు గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుని రెడీగా ఉంటే అరుదైన వ్యాధులు వ్యాపించకుండా అడ్డుకునే అవకాశం ఉంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి