iDreamPost

బుగ్గన బౌన్సర్ తో కన్నాకి కొత్త చిక్కు వచ్చి పడింది..!

బుగ్గన బౌన్సర్ తో కన్నాకి కొత్త చిక్కు వచ్చి పడింది..!

ఏపీ బీజేపీ అధ్యక్షుడికి పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. తొందరపాటు తో చేసిన కొన్ని పనులు చివరకు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. చివరకు అవి పార్టీలోనూ, ప్రజల్లోనూ పలుచన అయ్యేందుకు కారణం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ మీద బీజేపీ నేతలే కొందరు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఆయన తీరు బీజేపీని తీవ్రంగా నష్టపరుస్తోందని వారు మధనపడుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు విజయసాయిరెడ్డి వ్యవహారంలో జాతీయ అధ్యక్షుడు నేరుగా జోక్యం చేసుకుని కన్నాని కట్టడి చేయాల్సి వచ్చింది.

విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ మధ్య జరిగిన ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. చివరకు సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకూ వెళ్లినా వైఎస్సార్సీపీ ఎంపీ వెనక్కి తగ్గలేదు. పైగా కన్నా అమ్ముడుపోయారనే కామెంట్స్ కి తోడుగా ఎన్నికల ఫండ్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు. పురందేశ్వరిని కూడా ప్రస్తావించి ప్రకంపనలు పుట్టించారు. అయినా కమలదళంలో పెద్ద కదలిక కనిపించలేదు. ముఖ్యంగా కన్నా ఎప్పుడొస్తావ్ కాణిపాకం అంటూ పిలిచినా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఈ సవాళ్ల పరంపరలో చివరకు కన్నా కి మింగుడుపడని రీతిలో మౌనం దాల్చాల్సి వచ్చింది. ఇది రాజకీయంగా కన్నాకి తీరని నష్టమే మిగిల్చిందన్నది పలువురి అంచనా. దాని తాలూకా ఫలితాలు త్వరలో అందుకుంటారని కూడా చెబుతున్నారు.

ఆ క్రమంలోనే తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కన్నాపై కాలుదువ్వారు. కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలు వ్యవహారం ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. రాజీనామాకి సిద్ధమంటూ ఛాలెంజ్ విసిరారు. తాను డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా కిట్లు కొనుగోలు చేశారని చేసిన ఆరోపణలు నిరూపించాలని నిలదీశారు. దాంతో వెంటనే కన్నా గతం గుర్తుచేసుకున్నట్టు కనిపించింది. తన మాటలను సవరించారు. తాను చేసిన ఆరోపణలు అవి కాదంటూ సర్థుకున్నారు. తాను రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు వేరు అని చెబుతున్నారు. మీడియా ముందు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సవాల్ వద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. బుగ్గన సోదరుడితో పాటు మరో కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి, భాగస్వామిగా ఉన్న మరో కంపెనీ కొనుగోలు చేసిన విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు.

తద్వారా బుగ్గన ఛాలెంజ్ నుంచి కన్నా తప్పుకున్నట్టు స్పష్టం అవుతోంది. కొత్త కష్టాన్ని కొనితెచ్చుకోవడం ఇష్టం లేకపోవడంతోనే చివరకు కన్నా వెనుకడగు వేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నిరధార ఆరోపణలు కట్టబెట్టమని తన పార్టీ అద్యక్షుడు నేరుగా చెప్పిన తరుణంలో కన్నాకి ఇలాంటి పరిస్థితి తప్పలేదని అంతా భావిస్తున్నారు. ఏమయినా కన్నా చర్యలు, వ్యాఖ్యలతో కొత్త చిక్కుల్లో పడుతున్నట్టు స్పష్టం అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి