iDreamPost

చంద్రబాబుకు పొంచిఉన్న మరో ప్రమాదం

చంద్రబాబుకు పొంచిఉన్న మరో ప్రమాదం

అధికారంలో ఉన్నప్పుడు హామీలకు, ప్రచారానికి పరిమతమైన చంద్రబాబు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టు అయినా.. రుణమాఫీ అయినా.. ఇలా ఇచ్చిన హామీలను, చేయాల్సిన పనులను సకాలంలో చేయకపోవడంతో చంద్రబాబు విమర్శలను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఆ పనులన్నింటినీ చేస్తుండడంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయన సహనం కోల్పోతూ విమర్శలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

బీసీలకు అన్యాయం చేస్తున్నారు.. దళితులను అణచివేస్తున్నారు.. అంటూ తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేసే చంద్రబాబు అండ్‌ పార్టీకి.. 2022లో గట్టిదెబ్బ తగలబోతోంది. దళితుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొనబోతున్నారు. చెప్పిన పని చేయకపోవడం వల్లనే చంద్రబాబుకు ఈ పరిస్థితి రాబోతోంది. 2022 ఏప్రిల్‌ 14 నాటికి విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని జగన్‌ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 20 ఎకరాల్లో ఏర్పాటు చేసే అంబేడ్కర్‌ స్మృతి వనం పనులను ఏపీఐఐసీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పనులకు ఈ ఏడాది అక్టోబర్‌ 8వ తేదీన వర్చువల్‌ విధానంలో సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయగా.. తాజాగా 330 కోట్ల రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున 2022 ఏప్రిల్‌ 14న విగ్రహావిష్కరణ చేయాలని జగన్‌ సర్కార్‌ యోచిస్తోంది.

ఇదే చంద్రబాబుకు తలనొప్పిగా మారబోతోంది. చంద్రబాబు కూడా అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని 2017 ఏప్రిల్‌ 14వ తేదీన ప్రకటించారు. అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు అక్కడ పనులు మొదలు పెట్టలేదు. కొంత స్థలంలో మొక్కలు నాటి అంబేడ్కర్‌ స్మృతి వనం అని పేరు పెట్టారు. కానీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత రెండేళ్లపాటు అధికారంలో ఉన్నా.. ఆ పని చేయలేదు. నాడు చంద్రబాబు చెప్పిన మాటను.. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేయబోతుండడం చంద్రబాబుకు తలపోటుగా మారబోతోంది. దళిత నాయకులు, ప్రజల నుంచి చంద్రబాబు విమర్శలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి 2020 ఏప్రిల్‌ 14 తర్వాత ఏర్పడబోతోంది. మరి ఈ ప్రమాదాన్ని చంద్రబాబు అండ్‌ పార్టీ ఏ విధంగా ఎదుర్కొబోతోందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి