iDreamPost

Border : ఇండియా పాకిస్థాన్ యుద్ధానికి సజీవ రూపం – Nostalgia

Border : ఇండియా పాకిస్థాన్ యుద్ధానికి సజీవ రూపం – Nostalgia

ఇంట్లో పిల్లాపాపలతో నిశ్చింతగా జీవితం గడుపుతూ నిద్రపోతాం కానీ దానికి కారణమైన దేశ సరిహద్దుల్లోని సైనికుల అనంతమైన త్యాగం కారణమని గుర్తుకువచ్చే సందర్భాలు తక్కువ. వెండితెరపై కూడా వాటిని చూపించిన దాఖలాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అలాంటి వాటిలో ముందు వరసలో అగ్ర సింహాసనం దక్కించుకునే సినిమా బోర్డర్. 1971 ఇండియా పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో జరిగిన భీకర యుద్ధం ఆధారంగా దర్శకుడు జెపి దత్తా 1995లో స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారు. ఇది ఆయన డ్రీం ప్రాజెక్ట్. అప్పటిదాకా ఆయన చేసినవి అయిదు సినిమాలే. అన్నీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్లు. డబ్బులు తెచ్చేవి కానీ తన పేరు చిరకాలం నిలిచిపోవాలనే లక్ష్యంతో అకుంఠిత దీక్షతో బోర్డర్ కథను రాసుకున్నారు. ఫైనల్ వెర్షన్ పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది.

దీన్నో మల్టీ స్టారర్ గా తీర్చిదిద్దాలనేది దత్తా ప్లాన్. దానికి అనుగుణంగానే ముందు సంజయ్ దత్ ని తీసుకున్నారు. కానీ ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న కారణంగా అతను అరెస్ట్ అవ్వడంతో ఆ స్థానంలో జాకీ శ్రోఫ్ వచ్చాడు. షారుఖ్, సల్మాన్, అమీర్, అక్షయ్ కుమార్ లు అందరినీ వెళ్లి కలిశాడు. కానీ రకరకాల కారణాలు చూపి వాళ్ళు నో చెప్పారు. ఫైనల్ గా అక్షయ్ ఖన్నా లాక్ అయ్యాడు. ముందు నో అన్న సునీల్ శెట్టి రెండుసార్లు కథను ఆసాంతం విన్నాక ఇది వదులుకుంటే బాధ పడాల్సి వస్తుందని గుర్తించి డేట్లు ఇచ్చాడు. జుహీ చావ్లా నో చెప్పాక టబు వచ్చి చేరింది. ముందు ఒప్పుకున్న మనీషా కొయిరాలా తర్వాత తప్పుకుంది. దత్తాకు సమయం లేక పూజా భట్ ని తీసుకొచ్చి రీ ప్లేస్ చేశారు. ఇలా క్యాస్టింగ్ లోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

ఇక నిర్మాణం మరో యజ్ఞంలా సాగింది. నిర్మాణం తనదే కావడంతో కోట్ల రూపాయల బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చయ్యింది. దత్తా ప్రతిపాదన నచ్చిన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లు వాహనాలు, ఆయుధాలు, మెషీన్ గన్లు సప్లై చేశాయి. యునిఫార్మ్స్ సైతం అక్కడి నుంచే వచ్చాయి. మెయిన్ లీడ్ సన్నీ డియోల్ దత్తా డెడికేషన్ కు ఆశ్చర్యపోయేవారు.రాజస్థాన్ లోని బికినీర్ తో పాటు జోధ్ పూర్ తదితర లొకేషన్లలో షూటింగ్ జరిపారు. వార్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ దత్తా ఎమోషనల్ గా దాన్ని తెరకెక్కించిన తీరు థియేటర్లో చూసినవాళ్లకు గూస్ బంప్స్ తెప్పించాయి. 1997 జూన్ 13న విడుదలైన బోర్డర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. 3 జాతీయ అవార్డులతో పాటు ఫిలిం ఫేర్ లో 11 నామినేషన్లు దక్కించుకుంది. ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో తర్వాత చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏవీ బోర్డర్ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. అంతెందుకు దత్తానే తీసిన ఎల్ఓసి ఇంతకు మించి గ్రాండియర్ గా ఉన్నా ఫెయిల్ అయ్యింది

Also Read : Sankranthi 1997 Clashes : క్రేజీ సినిమాల పోటీలో మాస్ బొమ్మల విజయం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి