iDreamPost

గుడ్ న్యూస్.. జులై 17వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

  • Author singhj Published - 09:22 PM, Sat - 15 July 23
  • Author singhj Published - 09:22 PM, Sat - 15 July 23
గుడ్ న్యూస్.. జులై 17వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

తెలంగాణ రాష్ట్ర విశిష్ట సంస్కృతికి అద్దం పట్టే పండుగలుగా బతుకమ్మ, బోనాలను చెప్పుకోవచ్చు. ఈ రెండు పండుగలను ప్రజలు ఎంతో కోలాహలంగా జరుపుకుంటారు. రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు గత నెలలో సంబురంగా ప్రారంభమయ్యాయి. మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న ఓల్డ్ సిటీ బోనాలు, ఇదే నెల 17వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహిస్తారు. బోనాల నిర్వహణ కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించడం గమనార్హం.

బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటిలాగే సాధారణ సెలవును ప్రకటించింది. రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం జులై 17వ తేదీ సోమవారం రోజున సెలవు ఉంటుంది. ఈ రోజు సాధారణ సెలవు కింద కేటాయిస్తారు. అంతకుముందు రోజు ఆదివారం (జులై 16) కాబట్టి.. వరుసగా రెండ్రోజులు విద్యార్థులకు సెలవులు వచ్చాయని చెప్పొచ్చు. ఇకపోతే, హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహంకాళీ దేవికి జరిపే ‘ఆషాడ’ మాసంతో బోనాలు మొదలవుతాయి. బోనాల పండుగకు భక్తులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన కుండల్లో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

ప్రతి ఏడాది హైదరాబాద్​లో నెల రోజుల పాటు మూడు దశల్లో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహిస్తారు. బోనం అంటే భోజనం అనే అర్థం వస్తుంది. గోల్కొండలో వెలసిన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం పెట్టి, ఆ తర్వాత సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి గుడిలో లష్కర్ బోనాలు జరుపుతారు. అనంతరం పాతబస్తీ, లాల్​దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో ఇది ముగుస్తుంది. 150 ఏళ్ల కింద పెద్ద కలరా వ్యాప్తి తర్వాత ఈ పండుగను తొలిసారిగా జరుపుకున్నారని చెబుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి