iDreamPost

Project K : ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ ఎఫెక్ట్

Project K : ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ ఎఫెక్ట్

పాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల మార్కెట్ సృష్టించుకున్న ప్రభాస్ లైనప్ ఇప్పుడున్న ఏ హీరో అంత ఈజీ క్యాచ్ చేయలేరన్న మాట వాస్తవం. రాధే శ్యామ్ విడుదల పెండింగ్ లో ఉన్నా సలార్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా డార్లింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. తన వరకు ఆది పురుష్ ఫినిష్ చేశాడు కాబట్టి ఇక నెక్స్ట్ పరుగులు పెట్టాల్సింది ప్రాజెక్ట్ కెనే. దర్శకుడు నాగ అశ్విన్ ఈ స్క్రిప్ట్ మీద గట్టిగానే వర్క్ చేశాడు. నిన్న ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కె తర్వాత ప్రభాస్ హాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసేంత రేంజ్ కు వెళ్తే ఆశ్చర్యపోనక్కర్లేదని హింట్ ఇవ్వడం అంచనాలు పెంచేసింది.

మరో లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ప్రాజెక్ట్ కెలో కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. కథలోని ఓ ముఖ్యమైన పాయింట్ ఆల్రెడీ బాలీవుడ్ లో నిర్మాణంలో బ్రహ్మాస్త్రకు దగ్గరగా ఉందట. హిమాలయా పర్వతాల్లో ఉండే ఒక ఆయుధం బ్యాక్ డ్రాప్ ని రెండింటిలోనూ సెట్ చేశారట. అందుకే ఇప్పుడు నాగ అశ్విన్ ఆ చేంజ్ మీద వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో కానీ నిప్పు లేనిదే పొగరాదుగా. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి క్యాస్టింగ్ గట్టిగానే ఉన్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ అన్నారు కానీ అంతకు మించి ఏ చిన్న డీటెయిల్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇక ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 14 పోస్ట్ పోన్ అయ్యాక కొత్త తేదీని ఫిక్స్ చేయలేదు. ఏప్రిల్ లోనా లేక అంతకు ముందా అనేది ఒమిక్రాన్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఈసారి ఆర్ఆర్ఆర్ ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సలార్ కూడా 2022లోనే రావొచ్చు. అదే జరిగితే ఆది పురుష్ 2023కి, ప్రాజెక్ట్ కె 2024లో వస్తాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ తోనే మరో సినిమా చేసేందుకు డార్లింగ్ ఆసక్తిగా ఉన్నారట. మొత్తానికి రాబోయే మూడు నాలుగేళ్లు ప్రభాస్ అభిమానులకు గ్యాప్ లేకుండా కిక్ ఇవ్వబోతున్నారు

Also Read : Sid Sriram : టాప్ డైరెక్టర్ సినిమాలో హీరోగా సిద్ శ్రీరామ్.. కుదిరే పనేనా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి